ఎక్కడమ్మా నువ్వు లేనిది…?

Mar 3,2024 09:44 #Sneha, #Women Stories, #Women's Day
Where is it without you...?

వైఫల్యం, బలహీనత వైపు చూస్తే ముందుకెళ్లలేం.. సాధించాలన్న పట్టుదల, కృషి ఉంటే.. ఎంత కష్టాన్నైనా అధిగమించి, ఆకాశానికైనా ఎగరగలమని నిరూపించారు ఎందరో ధీర వనితలు. వారిలో కొందరి గురించి..

  • కాలితో విల్లు ఎక్కుపెట్టి..

విల్లును ఎక్కుపెట్టి గురిచూసి బాణం వేయాలంటే.. చేతుల పట్టుత్వంతో పాటు ఏకాగ్రత, తీక్షణత అవసరం. అదే కాలితో విల్లును ఎక్కుపెట్టడం పెద్దసవాలే! జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఆర్చర్‌ శీతల్‌దేవి కాలితో బాణాన్ని సంధిస్తోంది. పేద కుటుంబంలో పుట్టిన ఆమెకు పుట్టుక నుంచే చేతులు లేవు. లేని వాటి గురించి బాధపడకుండా, ఉన్న కాళ్లను ఉపయోగించి క్రీడాకారిణిగా ఎదిగింది. ఆమె పట్టుదలను గమనించిన ఆర్మీ సిబ్బంది శీతల్‌ను ఆటలవైపు ప్రోత్సహించి, ఆర్థికంగా సహకరించారు. పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రజతం, పారా ఆసియన్‌ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి.. ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది.

చందమామ వరకు..

అదిగో చందమామ అనటమే కానీ ఆ మామను దగ్గరి నుంచి చూసిన మహిళలే లేరు. ఇప్పుడా వరుసలో క్రిస్టినా కోచ్‌ మొదటుంది. చంద్రునిపై రోబోలు, మనుష్యులతో పరిశోధించేందుకు నాసా తలపెట్టిన ‘ఆర్టిమిస్‌-2’ ప్రయోగంలో నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారు. వారిలో క్రిస్టినా కోచ్‌ ఒకరు. నార్త్‌ కరోలినాకి చెందిన క్రిస్టినా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, నాసాలో చేరారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో 328 రోజులు గడిపి,అంతరిక్షంలో గడిపిన తొలి మహిళగా ఆమె రికార్డు స్థాపించారు.

ఐరాస వరకూ వెళ్లిన చెఫ్‌..

చెఫ్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు ఢిల్లీకి చెందిన అనహితా. అమ్మకు సాయం చేస్తూ వంటపై మక్కువ పెంచుకున్నారు. ఆ మక్కువే ఆమెను ఐక్యరాజ్యసమితిలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌కి ప్రతినిధిగా నిలబెట్టింది. ఇటీవల జీ20 సదస్సుకు వచ్చే అతిథులకు కూడా అనహితానే వండి పెట్టారు. పార్శీ కిచెన్‌ సర్వీస్‌, శాఖాహార రుచులతో ప్రఖ్యాతి పొందారు. తాజ్‌, మారియట్‌ హోటళ్లలో పనిచేశారు.

గిరిజన మహిళా జడ్జి

గిరిజన తండాల్లో ఆడపిల్లలు పది వరకు చదవటమే అరుదు. అలాంటిది శ్రీపతి ‘లా’ చదువుకుంది. కుమార్తె చదువు కోసం తండ్రి కలియప్పన్‌ ఉన్న ఊరు వదిలి, తిరుపట్టూరులోని యలగిరి హిల్స్‌కు మకాం మార్చారు. లా చదువుతుండగా ఆమెకు వివాహమైంది. ఆ తర్వాత సివిల్‌ జడ్జి పోస్ట్‌ కోసం టి.ఎన్‌.పి.ఎస్‌.పి పరీక్షకు అప్లయి చేసేనాటికి నిండు చూలాలు. ప్రసవించిన మరుసటి రోజే ఆమె పరీక్షకు హజరుకావడం విశేషం. భర్త సహకారంతో 250 కి.మీ దూరంలో ఉన్న చెన్నైకి వెళ్లి, పరీక్ష రాసింది. తమిళ మీడియంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించిన స్టాలిన్‌ ప్రభుత్వం శ్రీపతికి సివిల్‌ జడ్జి పోస్టింగ్‌ ఇచ్చింది.

హక్కుల కోసం కొరడా దెబ్బలు..

ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేక నిరసనల్లోనూ, మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా మానవహక్కుల కోసం గళమెత్తింది మొహమ్మదీ. ఈ పోరాటాల్లో ఎన్నోసార్లు అరెస్టు అయ్యి, 153 కొరడా దెబ్బలు తిన్నారు. 31 ఏళ్ల జైలు శిక్ష విధించినా ఆమె తన గళాన్ని ఎత్తడం ఆపలేదు. యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఫ్రైజ్‌ అందుకున్న ఇరాన్‌ మహిళా జర్నలిస్టుల్లో మొహమ్మదీ ఒకరు.

మహిళల కోసం ఆన్‌లైన్‌ ప్రచారం..

ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా ప్రాంతాల్లో బాలికలు, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించలేక విద్య, ఉద్యోగాలకు దూరమౌతున్నారు. తద్వారా పేదరికంలో మగ్గిపోతున్నారని అంటోంది ఒడిశాకు చెందిన 22 ఏళ్ల ప్రాచీ మిశ్రా. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆన్‌లైన్‌ ప్రచారం మొదలుపెట్టారు. ఆమె ప్రచారానికి స్పందించిన ప్రభుత్వం నాలుగు నగరాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.

  • హేమలత
➡️