ఆంధ్రాలో తెలుగు సినీ పరిశ్రమ నెలకొనేదెప్పుడు?

Apr 14,2024 19:32 #movie

తెలుగు సినీరంగ పరిశ్రమ దశలవారీగా ఎదుగుతూ వస్తోంది. మొదట్లో మద్రాసు కేంద్రంగా మొదలై, తరువాత హైదరాబాదుకు తరలివచ్చింది. అనేక విభాగాల్లో, అనేక రూపాల్లో విస్తరించి, ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగింది. అనేకమంది నటులకు, సాంకేతిక నిపుణులకు, కళాకారులకు సినీ పరిశ్రమ జీవనాధారంగా నిలుస్తోంది. సినిమా పరిశ్రమ మద్రాసులో ఉన్న రోజుల్లో సైతం అనేక సినిమాల షూటింగులు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో చాలావరకూ జరిగేవి. అవుట్‌ డోర్‌ షూటింగులకు అనువైన ప్రదేశాలు, వైవిధ్యభరితమైన నేపథ్యాలూ ఆంధ్రప్రదేశ్‌ నిండా ఉండటమే ఇందుకు కారణం.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత హైదరాబాదు వలె విశాఖపట్నం కేంద్రంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని చాలామంది వ్యక్తం చేశారు. విశాఖలో ఇప్పటికే రామానాయుడు స్టూడియో నిర్మించి ఉంది. భీమిలి, అరకులోయ వంటి ప్రకృతి అందాలతో శోభిల్లే ప్రదేశాలు ఉండనే ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదీతీరాలూ, గ్రామీణ ప్రాంతాలు, చారిత్రిక క్షేత్రాలు చాలానే ఉన్నాయి. కానీ, అనేక కారణాల వల్ల ఈ పదేళ్లలో సినిమా పరిశ్రమ ఇక్కడ నెలకొనలేదు.
తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాదు రావటానికి అప్పట్లో ఎన్‌టిఆర్‌, ఎఎన్‌ఆర్‌, రామానాయుడు, డివిఎస్‌ రాజు, దాసరి నారాయణరావు లాంటి వారు తీవ్రంగా కృషిచేశారు. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీ, అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు, ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లు నెలకొన్నాయి. శిక్షణ పొందిన వారు సినీరంగంలోని వివిధ విభాగాల్లో రాణిస్తూ వస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో చిన్నా పెద్దా అన్నీ కలిపి ఏడాదికి సుమారు రెండొందల సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా, ఆంధ్రా పేరుతో నటులు, నిర్మాతలు, దర్శకులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇలా అనేక రంగాలకు చెందిన వారు తమ సంఘాలను కొత్తగా స్థాపించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం సుందర నగరం. బీచ్‌లు, విస్తారమైన సుందర మైదానాలు మంచి లకేషన్లుగా ఉన్నాయి. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో కొన్ని షూటింగులు జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లుగా సినిమా షూటింగులు పెద్దఎత్తున జరుగుతూనే ఉన్నాయి. ప్రతినెలా విశాఖ కేంద్రంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని ఓ సినిమా విడుదల అవుతుంటుంది. అరకు, భీమిలి, మన్యం ప్రాంతాల్లో పెద్దఎత్తున షూటింగ్‌లు జరుగుతున్నాయి. విజయవాడ కేంద్రంగా కూడా షూటింగులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ, కృష్ణానది, భవానీ ద్వీపం, ఉండవల్లి గుహలు, అమరావతి, హంసలదీవి, నూజివీడు, చల్లపల్లి, ముక్త్యాల కోటల్లో షూటింగులు కొనసాగుతున్నాయి. అయితే, సినిమాకు సంబంధించిన అన్ని రకాల పనులూ ఇక్కడే పూర్తయ్యే అవకాశం లేదు. సాంకేతిక నిపుణులూ, నటులు, స్టూడియోలూ హైదరాబాదులోనే ఉన్నాయి. ఒకమేరకైనా ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు జరగాల్సి ఉంది.
కొత్త సినిమాలకు శ్రీకారం
హైదరాబాద్‌కు సమాంతరంగా విజయవాడలో స్థాపించిన ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ‘ఉగాది సినిమా పురస్కారాలుా2024 వేడుకలు ఇటీవల హ్యాపీ రిసార్ట్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎపి ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు ఎంఎం రత్నం, మధు స్టూడియో అధినేత అంబటి మధుమోహన కృష్ణ, సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అజరుఘోష్‌, దర్శకులు ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో విస్తారమైన నదీ, సముద్ర తీరాలు, చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాల్లో షూటింగులు చేసుకోవటానికి అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ నగరాలు సరికొత్త శోభతో అలరారుతున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు అతి చేరువలో అటవీ ప్రాంతాలు, కోటలు షూటింగ్‌ జరుపుకునేందుకు అనువుగా ఉన్నాయి’ అంటూ వివరించారు. హ్యాపీ రిసార్ట్స్‌లోని మధు ఫిలిమ్స్‌ స్టూడియోలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఒక సినిమాను పూర్తిస్థాయిలో తీసేంతగా అనువైన ప్రదేశాలు, ప్రత్యేక సెట్టింగులు ఉన్నాయని; ఇక్కడ ఎవరైనా సినిమా తీస్తే పూర్తిగా స్టూడియో ఉచితమని స్టూడియో అధినేత అంబటి మధుమోహనకృష్ణ ప్రకటించారు. అజరుఘోష్‌ స్పందిస్తూ ‘తొందరలో రెండు సినిమాలను నా స్నేహితులతో ఇక్కడే తీస్తా. రెండు కథలు కూడా నేనే ఇస్తా’ అని ప్రకటించారు. సినీ ప్రముఖులు రత్నం మాట్లాడుతూ తాము సిజి సహకారం అందిస్తామని చెప్పారు. రాబోయేకాలంలో 24 క్రాప్ట్‌లకు సంబంధించిన అంశాల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తూ, ఇండిస్టీలో తలెత్తే విషయాలపై సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించుకుందామని ప్రతినిధులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన తరువాత కొంత ఆలస్యమైనా ఆంధ్రాలో కూడా చిత్ర పరిశ్రమ బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తంచేశారు. ఎన్నికల వేళ ఈ అంశం మీదా రాజకీయ పక్షాలు కూడా మాట్లాడితే బాగుంటుంది.

➡️