అధికారుల తనిఖీలపై గోధుమ వ్యాపారుల ఆందోళన

Dec 20,2023 15:42 #Stocking Norms, #Wheat

న్యూఢిల్లీ  :   హోల్‌సేల్‌ దుకాణాలు, రిటైల్‌ సంస్థలు సహా గోధుమ పిండి మిల్లులపై అధికారుల దాడులపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో అధికారులు పదేపదే గోడౌన్‌లపై దాడులు చేపట్టడాన్ని వ్యాపారులు ఖండిస్తున్నారు. స్టాక్‌ పరిమితుల వివరాలు సేకరించిన అనంతరం తనిఖీలు చేపట్టాలని యాజమాన్యం, వ్యాపారులు అధికారులను కోరుతున్నారు. అయితే కేంద్రం విధించిన స్టాక్‌ పరిమితులతో మార్కెట్‌లో గోధుమల నిల్వలు క్షీణించే అవకాశం ఉందని వ్యాపారులు, యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  ప్రభుత్వం నిబంధనలను సడలించకపోతే ఫిబ్రవరిలో గోధుమల ఉత్పత్తి మార్కెట్‌కు చేరుతుందని, దీంతో నిల్వ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాలు సహా పంపిణీదారులపై గోధుమల స్టాక్‌ నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం.. టోకు వ్యాపారులు 2,000 టన్నులకు బదులుగా కేవలం వెయ్యిటన్నుల గోధుమలను మాత్రమే నిల్వ చేయాల్సి వుంటుంది. అదేవిధంగా రిటైల్‌ అవుట్‌ లెట్‌లు పది టన్నులకు బదులుగా ఐదు టన్నుల గోధుమలు మాత్రమే నిల్వ చేయాల్సి వుందని ప్రభుత్వం పేర్కొంది.  ఆటా, మైదా, రవ్వ పంపిణీ చేసే మిల్లుల్లో నెలవారీ నిల్వ సామర్థ్యంలో నాలుగో వంతు ఉండాలని, ఇది గరిష్టంగా 70 శాతానికి మించకూడదని ప్రభుత్వం సూచించింది.  2023-24లో మిగిలిన నెలలకు ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.

ఒకవేళ నిల్వ పరిమితికి మించి గోధుమలు ఉన్నా.. 2024, జనవరి 6 నాటికి నిల్వను పరిమితికి కట్టుబడి ఉండాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అదనంగా, గోధుమలను నిల్వ చేసే గోడౌన్‌లు స్టాక్‌ పరిమితిని పోర్టల్‌లో నమోదు చేయాలని, ప్రతి శుక్రవారం స్టాక్‌ స్థాయిని అప్‌డేట్‌ చేయాల్సి వుంటుందని పేర్కొంది.

➡️