58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం

Mar 30,2024 08:31 #ap cm jagan, #campaign, #Kurnool

– మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి
– ఇవి ప్రజల భవిష్యత్‌ నిర్ణయించే ఎన్నికలు
– చేసిన మంచితో మీ ముందుకు వస్తున్నాం
-మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్‌
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి :గత 58 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం కర్నూలు జిల్లాలో సాగింది. పెంచికలపాడు నుండి బస్సు యాత్ర ప్రారంభమైంది. కోడుమూరులో జగన్‌ చేనేతలతో మాటామంతీ నిర్వహించారు. కైరవాడి, గోనేగండ్ల, రాళ్లదొడ్డి మీదుగా ఎమ్మిగనూరు వరకు యాత్ర సాగింది. ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ఈ ప్రభుత్వానికి, దిశ యాప్‌ ద్వారా భద్రత ఇచ్చిన మీ ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలు రాఖీ కట్టాలని కోరారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, ప్రజల, పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. పెత్తందారులను ఓడించేందుకు, ప్రజల పక్షాన నిలబడేందుకు తాను సిద్ధమని, మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. విద్యా రంగంలో కనివినీ ఎరుగని మార్పులు తెచ్చామన్నారు. పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్‌ కోసం యుద్ధం చేయడానికి అంతా సిద్ధమా? అని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన తమకు, రైతు వ్యతిరేక కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. రైతన్నలు తమను భుజం తట్టి ప్రోత్సహించాలని కోరారు. సామాజిక న్యాయం ఎలా చేయాలో చేసి చూపించామన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, అందులో 80 శాతం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ఇచ్చామని, నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం వారికే ఇచ్చేలా చట్టం చేశామని వివరించారు. చేసిన మంచితో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. చంద్రబాబు కూటమి పేరుతో కుట్రలు చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందన్నారు. ఈ పొత్తులను, జిత్తులను, మోసాలను, కుట్రలను ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జెండాలు జతకట్టిన పార్టీలకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్న పార్టీలకు సమాధి కట్టాలని కోరారు. ఎస్‌సిలను అవమానించిన వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని, బిసిల తోకలు కత్తిరిస్తామన్న వారికి తోకలు కత్తిరించాలని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలే గుర్తొస్తాయని విమర్శించారు. మళ్లీ మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారని, దత్తపుత్రుడిని, ఢిల్లీ నుంచి మోడీని తోడు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. అనంతరం ఆరెకల్‌, ఆదోని క్రాస్‌, విరుపాపురం, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్‌ మీదుగా పత్తికొండ చేరుకొని కెజిఎన్‌ ఫంక్షన్‌ హాలులో రాత్రి బస చేశారు. బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, వైసిపి రీజినల్‌ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, ఎంపి గోరంట్ల మాధవ్‌, కర్నూలు ఎంపి అభ్యర్థి బివై.రామయ్య, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️