అద్దంకిలో గెలుస్తాం : వైవీ

Dec 21,2023 02:19

ప్రజాశక్తి – అద్దంకి
రాబోయే ఎన్నికలలో వైసిపి విజయం సాధించి తిరిగి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, 175కు 175అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు వైసిపిని గెలిపించుకుంటారని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైసిపి నూతన ఇన్‌చార్జి హనుమరెడ్డి అధ్యక్షతన స్థానిక కూకట్ల కన్వెన్షన్‌లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలతో పాటు నియోజకవర్గ వైసీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 1.85కోట్ల కుటుంబాల్లో 1.10కోట్ల కుటుంబాలకు జగన్మోహన్‌రెడ్డి లబ్ధి చేకూర్చారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ప్రజలకు ఇంత స్థాయిలో లబ్ధి చేకూర్చలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25లక్షల వరకు లబ్ధి చేకూరేలా పేదలకు వెన్నుదన్నుగా పదకాన్ని రూపొందించారని అన్నారు. అందుకే 175కు 175 గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందులో భాగంగా అద్దంకిలో కూడా కచ్చితంగా గెలుస్తామని భరోసా ఇచ్చారు. రాజశేఖరరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి సహకారంతో రెండు సార్లు అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి నమ్మకద్రోహం చేసి వెన్నుపోటు పొడిచారని పరోక్షంగా గొట్టిపాటి రవికుమార్‌ను విమర్శించారు. వైసీపీ ఆవిర్భావం నుండి హనుమరెడ్డి పార్టీతో నడిచారని అన్నారు. వృత్తి, వ్యాపారాలను వదిలి పార్టీ కోసం పని చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి అద్దంకిలో పోటీ చేయడానికి జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సహించారని, ప్రజలంతా వెన్ను దన్నుగా ఉండి గెలిపించి వైసీపీ జెండా ఎగురవేయాలని అన్నారు. కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ కృష్ణ చైతన్యను కలుపుకొని పోవాలని హనిమిరెడ్డికి సూచించారు. జగన్మోహన్‌రెడ్డి, తాను చైతన్యతో మాట్లాడామని అన్నారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పించామని, అవసరమైతే మరోసారి మాట్లాడుతామని చెప్పుకొచ్చారు. వైసిపి ఇన్‌ఛార్జి హనిమిరెడ్డి మాట్లాడుతూ నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని అద్దంకి నియోజకవర్గం కార్యకర్తలు, ప్రజల మద్దతుతో ఓడించి అసెంబ్లీలో అడుగెడతానని, అద్దంకి సీటును జగన్మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తానని అన్నారు. వైవి సుబ్బారెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డి, వైవి భద్రారెడ్డి, కాకాని రాధాకృష్ణమూర్తి, బివి కృష్ణారెడ్డి, మేడకం గోపాలరెడ్డి, కోట శ్రీనివాసకుమార్, రావినూతల వెంకటసుబ్బయ్య, చింతా రామారావు, బొల్లెని రామకృష్ణ, పూనూరు నరేంద్ర, చిన్నపల్లి శ్రీనివాసాచారి, అద్దంకి, బల్లికురవ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు.

➡️