గవర్నర్ల వ్యవస్థను రద్దు చేస్తాం

– పట్టణాల్లోనూ ఉపాధి పథకం తీసుకొస్తాం
– ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు అమల్జేస్తాం
– సిపిఐ ఎన్నికల ప్రణాళికలో హామీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్ల వ్యవస్థను రద్దు చేస్తామని, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని, గ్రామీణ భారతావనిలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణాల్లోనూ ఉపాధి కల్పించేందుకు చట్టం తీసుకొస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. సిపిఐ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శి డి రాజా.. నాయకులు బికె కాంగో, సయ్యద్‌ అజీజ్‌ పాషా, దినేష్‌ వర్నేతో కలిసి సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి గవర్నర్‌ వ్యవస్థ రద్దు చేయడం కోసం తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, కేంద్రం జోక్యాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తామని తెలిపింది. ‘రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలకు ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పిస్తామని మేనిఫెస్టోలో సిపిఐ హామీ ఇచ్చింది.
మార్పు కోసం ఓటు : డి.రాజా
మేనిఫెస్టో విడుదల సందర్భంగా డి రాజా మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దేశానికి, భవిష్యత్తుకు చాలా కీలకమైనవి, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి పాలన దేశానికి వినాశకరమైనదని ఆయన అన్నారు. బిజెపిని గద్దె దించేందుకు ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ సైన్యంగా పనిచేస్తున్న బిజెపి భారత రాజ్యాంగాన్ని మార్చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. మోడీ పాలనలో దేశ ప్రజల బతుకులు కష్టతరంగా మారాయన్నారు. దేశ సంపదను అతి సంపన్నులకు కట్టబెట్టి పేదలను మరింత పేదరికంలో బిజెపి నెట్టివేస్తోందని తప్పుబట్టారు. రాజ్యాంగ, లౌకిక, ప్రజాస్వామ్యం, సమాఖ్య విలువలను మంటగలుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఎత్తుగడులను ఓడించేందుకు ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు తమ పార్టీ తనవంతు పాత్ర పోషిస్తుందని రాజా తెలిపారు.
మేనిఫెస్టోలో ప్రధానాంశాలు
పౌరసత్వ సవరణ చట్టం, యుఎపిఎ రద్దు కోసం పోరాటం కొనసాగిస్తామని, ఎన్నికల కమిషనర్ల నియామకం పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని, సాధారణ జనాభా గణనతోపాటు కుల గణనను చేపట్టేందుకు కృషి చేస్తామని సిపిఐ హామీ ఇచ్చింది. పట్టణ ఉపాధి హామీ పథకం కోసం పాలక పార్టీలపై ఒత్తిడి పెంచుతామని తెలిపింది. సైన్యంలో కాంట్రాక్టీకరణ కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ రద్దు పథకాన్ని చేసేలా ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొంది. గిగ్‌-వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సి, ఎస్టి, బిసిల 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లును తీసుకొస్తామని పేర్కొంది. కార్పొరేట్‌ పన్ను పెంచుతామని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 పని దినాలు కల్పించి, కనీస వేతనం రూ.700 ఉండేలా కృషి చేస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో చొప్పించిన అన్ని అశాస్త్రీయ భాగాలను తొలగిస్తామని పేర్కొంది.

➡️