తాగునీటిపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి : సిపిఎం

Mar 27,2024 23:44 ##apcpm #prakasam #water

ప్రజాశక్తి – మార్కాపురం
త్రాగు నీటి కొరత లేకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి కోరారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ తక్కువ వర్శపాతం నమోదైనదని తెలిపారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. సాగర్ జలాల కేటాయింపు కూడా తగ్గిందని తెలిపారు. గత ఏడాది జిల్లాలో 220గ్రామాల్లో తాగు నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం టాంకర్ల ద్వారా నీరు సరఫరా చేశారని గుర్తు చేశారు. టాంకర్ ఆపరేటర్లకు సుమారు రూ.90 కోట్ల బకాయిలు నేటికి వున్నాయని తెలిపారు. ఈ ఏడాది వేసవి ఎండలు ముందుగానే వచ్చాయని అన్నారు. త్రాగు నీటి కొరత ఏర్పడి బెస్తవారిపేట, పెద దోర్నాల, కొనకలమిట్ట, కనిగిరి మండలాల్లో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నాలకు దిగారని అన్నారు. జిల్లాలో సాగర్ నీటి ద్వారా నింపాల్సిన సమ్మర్ స్టోరేజ్ టాంకులు, చెరువులు ఉన్నాయని అన్నారు. వీటిని జూన్ వరకు అవసరమైన నీటితో నింపాలని కోరారు. రక్షిత మంచినీటి పథకాలకు అవసరమైన రిపేర్లు చేయాలని కోరారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. తాగునీటి పధకాల నిర్వహణ మెరుగుపర్చాలని అన్నారు. చేతి పంపులు మర్మత్తులు చేయాలని అన్నారు. 12మండలాల్లో త్రాగు నీటి కొరత ఉన్నట్లు తెలుస్తున్నదని తెలిపారు. 108గ్రామాల ప్రజలు నీటి సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. అధికారులు జిల్లాలో త్రాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.

➡️