తామరపల్లిలో మంచినీటికి కటకట

Feb 7,2024 10:53 #Konaseema
water problem in tamarapalli

పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ప్రజాశక్తి-రామచంద్రపురం : అసలే వేసవికాలం ఆపై మంచినీటి అవసరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామానికి మంచినీళ్లు సక్రమంగా అందకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం కటకటలాడుతున్నారని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కే గంగవరం మండలంలోని తామరపల్లి గ్రామం 1500 జనాభా కలిగి ఉంది. గ్రామంలో 2001లో నిర్మించిన మంచినీటి ట్యాంకు శిధిలం కావడంతో నీటి సరుకులు అంతంత మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కుందూరు కేంద్రంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఒక మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు కుందూరు నుండి గంగవరం, తామరపల్లి, కొత్తకోట, సుందరపల్లి, ఊడుమూడి గ్రామాలకు మంచినీటి సరఫరా కై ట్యాంకులను నిర్మించారు. అందులో భాగంగా తామరపల్లి గ్రామానికి 40 వేల లీటర్ల కెపాసిటీతో ట్యాంక్ నిర్మించారు. 2011లో నిర్మించిన ట్యాంకు అప్పటి జనాభా వెయ్యి మంది కావడంతో మంచినీరు సరిపోయేది. ప్రస్తుతం గ్రామ జనాభా 1500 కు పెరిగింది. దీంతో ఆ నీటి ట్యాంకు సరఫరా గ్రామస్తులకు అందకపోవడంతో మంచినీటి సమస్య ఉత్పన్నమైంది. దీనికి తోడు కుందూరు ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వచ్చే మంచినీరు ఉదయం అరగంట మాత్రమే రావడంతో మిగిలిన రోజంతా గ్రామస్తులు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. చాలీచాలని పైపులైనులతో కేవలం అరగంట మాత్రమే నీళ్లు ఇవ్వడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న ప్రాంతాలకు ఇంకా వాటర్ టాప్ కూడా వేయకపోవడంతో గ్రామస్తులు మంచినీటి కోసం పలు వాటర్ ప్లాంట్లకు మంచినీరు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. గ్రామస్తులకు సరిపడా ఉదయం సాయంత్రం మంచినీటిని సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడే నీరు సరఫరా ఎలా ఉంటే ఇక వచ్చే వేసవిలో పరిస్థితి ఏమిటని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️