నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు

స్వచ్ఛ భారత్‌ పథకం అమల్లో నిర్లక్ష్యం
వ్యర్థాల నిర్వహణలో కనిపించని చిత్తశుద్ధి
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : పలు గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ భారత్‌ పథకం అమలు సక్రమంగా లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడం, ఆర్థిక సంఘాల నిధులు ఖర్చుపై ఆంక్షలు విధించడం, ఉన్న కాస్త సాధారణ నిధులు అభివద్ధి పనులకు సైతం సరిపోకపోవడం వంటి అనేక కారణాల వలన పల్లెలో పారిశుధ్యం బాగా క్షీణిస్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చెత్త నుంచి సంపద తయారు చేసే విధంగా పలు పంచాయతీల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ నిరుపయోగంగా మారాయి. రూ.కోట్లలో ఖర్చు చేసి వీటిని నిర్మించినా అక్కరకు రాకుండా పోతున్నాయి. దీంతో రోగాలతో సహవాసం చేయాల్సి వస్తుందని పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 385 గ్రామ పంచాయతీలుండగా 4,85,089 కుటుంబాలున్నాయి.15,00,798 మంది జనాభా నివసిస్తున్నారు. 290 గ్రామాలకు చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలుండగా ఇంకా 95 కేంద్రాలు నిర్మాణాలు జరగాల్సి ఉంది.అధికారుల లెక్కల ప్రకారం 262 కేంద్రాల్లో మాత్రమే సంపద తయారవుతుంది. 28 పంచాయతీల్లో నిరుపయోగంగా మారాయి. అన్ని పంచాయతీల్లో రోజుకి సుమారు 16 టన్నులు ప్లాస్టిక్‌, కాగితాలు వంటివి పొడి చెత్త, 30 టన్నుల తడి చెత్త, మరో 10 టన్నులు హానికరమైన వ్యర్థాలు ఉత్పత్తి జరుగుతోంది.

లక్ష్యంపై నిర్లక్ష్యం

స్వచ్ఛ భారత్‌ లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు, వ్యర్థాలతో పంచాయతీలకు సంపద సష్టించాలన్న ప్రభుత్వ ఆశయం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యర్థాల సేకరణ, నిర్వహణకు ఉద్దేశించిన చెత్త సంపద కేంద్రాలు అనేక చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల నిర్మాణం జరగలేదు. వీటిని మొదటి విడతలో మండల కేంద్రాల్లో, తరువాత క్రమంగా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి తద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరేలా ప్రణాళిక రూపొందించినా ఆశించిన ఫలితం రావడం లేదు. స్వచ్ఛ భారత్‌ పథకం ద్వారా రూ.14 లక్షలు, ఉపాధి పథకం ద్వారా రూ.2 లక్షలు 2015లో కేటాయించారు. తరువాత పూర్తిగా ఉపాధి నిధులే వెచ్చించారు. సిమెంటు ప్లాట్‌ ఫామ్‌, వర్మీ కంపోస్టు తయారీకి పిట్‌లు, తడి, పొడి వ్యర్థాలు వేరు చేసేందుకు కంపార్టుమెంట్లు నిర్మించారు. వ్యర్థాల రవాణాకు ట్రాక్టర్‌, రిక్షా కొనుగోలు చేశారు. దీనిపై సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. కానీ అనేక చోట్ల వాహనాలు రక్షాలు మరమ్మతులు గురై మూలకు చేరాయి. సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారు. దాంతో వ్యర్ధాల రవాణా పనిచోట్ల సక్రమంగా సాగడం లేదు.

అధ్వాన్నంగా పారిశుధ్యం

పలు పంచాయతీల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. శివారు గ్రామాల్లో పారిశుధ్య పనులు అసలు జరగడం లేదని స్థానికులు విలపిస్తున్నారు. కరప మండలంలోని వేపకాయలపాలెం, గురజనాపల్లి, యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, వాకతిప్ప, అమీనాబాద్‌, కొత్తపల్లి, కొమరగిరి, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, వన్నెపూడి, చిన్న జగ్గంపేట, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, కాకినాడ రూరల్‌ మండలంలోని ఇంద్రపాలెం, చీడిగ, కొవ్వాడ, రేపూరు, కొవ్వూరు, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, సూర్యారావుపేట, పి.వెంకటాపురం, పెదపూడి మండలంలోని శహపురం, పెదపూడి, సంపర,వేండ్ర, కాండ్రేగుల, ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం, పిఠాపురం మండలంలో గోకివాడ, మాధవపురం, చిత్రాడ, విరవాడ, మంగితుర్తి తదితర గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క చెత్త నుంచి సంపద కేంద్రాలు అక్కరకు రాక మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వెరసి గ్రామాల్లో పోగుబడిన చెత్తను ఊరు శివారున, బహిరంగ ప్రదేశాల్లోనూ, రోడ్డుకి ఇరువైపులా వేస్తున్నారు. దీంతో ప్రజలు రోగాలతో సతమతమతుండమే కాకుండా తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై తక్షణం స్పందించి అధికారులు చెత్త నిర్వహణపై పూర్తిస్థాయిలో దష్టి సారించి ప్రజలు రోగాలు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. స్వచ్ఛ భారత్‌ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️