టెస్ట్‌, వన్డేలకు వార్నర్‌ గుడ్‌బై

Jan 2,2024 08:13 #Cricket, #Sports, #warner
  • పాకిస్తాన్‌తో మూడోటెస్ట్‌ చివరిదంటూ ప్రకటన

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(37) కొత్త సంవత్సరంలో క్రీడాభిమానులకు ఓ ఝలక్‌ ఇచ్చాడు. టెస్ట్‌, వన్డే క్రికెట్‌లకు గుడ్‌బై చెబుతున్న సోమవారం ప్రకటించాడు. ”కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలనే నిర్ణయించుకున్నట్లు, ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తానని, ఆసీస్‌ తరఫున ప్రతి చిన్నారి ఆడేలా స్ఫూర్తిగా నిలిచానని భావిస్తున్నానని” తెలిపాడు. భారత్‌ వేదికగా జరిగిన ఐసిసి వన్డే ప్రపంచకప్‌ను ఆసీస్‌ జట్టు రికార్డుస్థాయిలో 6వ సారి కైవసం చేసుకున్న జట్టులో వార్నర్‌ కీలకపాత్ర పోషించాడు. ఇక పాకిస్తాన్‌తో సిడ్నీ వేదికగా బుధవారం నుంచి జరిగే 3వ టెస్ట్‌తో కెరీర్‌లో 112వ టెస్ట్‌ ఆడనున్నాడు. అలాగే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20 ఫ్రాంచైజీ దుబారు క్యాపిటల్స్‌ తమ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను నియమించుకొన్నట్లు ప్రకటించింది. ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్‌ వార్నర్‌ గతంలో కెప్టెన్‌గా వ్యవహరించాడు.

చివరి టెస్టులో సెంచరీ కొట్టాలి: సిడ్నీ మైదానం క్యురేటర్‌

సిడ్నీ క్రికెట్‌ మైదానంలో పాకిస్తాన్‌తో జరిగే టెస్ట్‌ చివరిదంటూ ప్రకటించిన వార్నర్‌పై ఎస్‌సిజి క్యురేటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ”డేవిడ్‌ వార్నర్‌ చాలాకాలంపాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. జట్టు కోసం చాలా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడిపట్ల మాకున్న గౌరవం అపారం. మా టీమ్‌ అంతా అతడి చివరి టెస్టులో సెంచరీ కోసం ఎదురు చూస్తోందని నాకు తెలుసు” అని ఎస్‌సిజి క్యురేటర్‌ ఆడమ్‌ లూయిస్‌ తెలిపాడు. తొలి టెస్టులో అద్భుతమైన శతకంతో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

➡️