మేలుకో నేస్తమా

Dec 4,2023 13:47 #Sneha

అమ్మమ్మ కొట్టిందని నాన్నమ్మను చేరిన

అమాయకత్వం మనది

ఏదో కావాలని

ఇంకా ఏదో పొందాలనే తపనతో

ఒక్క ఛాన్స్‌, ఒక్క ఛాన్స్‌ అన్న

ప్రతి ఒక్కరినీ..

ఒడిని చేర్చుకునే పెద్ద మనసు మనది !

తప్పులందు మన తప్పులెన్నక

ఆడే వైకుంఠపాళీ మన రాజకీయాలది

వరించిన పదవిని ఒడిసిపడతారు

విశ్వరూపం చూపిస్తారు !

వారు, వీరు అని తేడా లేక..

గద్దెనెక్కేంతవరకు సేవకుడిని అంటారు

గద్దెక్కినాక మనపై ఎక్కి

స్వారీ చేస్తుంటారు

నిన్న, నేడు, రేపు తేడా లేదు

వచ్చేవారు వస్తున్నారు దేశసేవ పేరిట

దోచేవారు దోచుకుంటున్నారు

నలిగిపోయేది మధ్యతరగతి

మానవుడు ఒక్కడే !

పథకాల పేరిట ఎరవేసి

బానిసత్వాన్ని వారసత్వంగా చేసి

బడా బాబుల బంగ్లాకు దిష్టిబొమ్మలై

ప్రతిపక్షం లేని చదరంగాన్ని

ఆడుతున్నారు !

పచ్చనోటు చూసి పడగ తొక్కారు

సానుభూతిలో సగం మునిగారు

బండరాయిని దించాలనుకుని

గుదిబండని

నెత్తికెక్కించుకున్నారు

మేలు మాట దేవుడెరుగు..

కోల్కోలేని దెబ్బ తగిలి

విలవిలలాడేరు !

ఒక్కసారి ఆలోచించండి !

రాజ్యాన్ని పంచుకొనే దాయాది లేనప్పుడు

తాను చేసిందే శాసనమని

రాజు విర్రవీగుతాడు

తన ఉనికికి ముప్పు ఉందని తెలిస్తే…

ప్రజలను ఆశ్రయిస్తాడు

ప్రజాభిమానాన్ని కోరుకుంటాడు

ప్రజా శ్రేయస్సుకు కాస్తయినా

ఆలోచిస్తాడు !

పోటీలేని రాజు పోతల గిత్తై

ఎగిరెగిరి పడతాడు

ప్రజల అండే తనకు రక్ష

అని తెలిసేలా చేద్దాం

ఆలోచించి అడుగు ముందుకు వేద్దాం

మన దేశాన్ని మనమే కాపాడుకుందాం !! – జ్యోతి మువ్వల 90080 83344

➡️