బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్‌..

 ఢాకా :    ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ప్రధాని షేక్‌ హసీనా ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశాభివృద్ధికి  ప్రజాస్వామ్యం కీలకమని అనంతరం ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు అనువైన  వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) ఎన్నికలను బహిష్కరించడంతో .. ఆ పార్టీని ‘ఉగ్రవాద సంస్థ’గా ఆరోపించారు.

బిఎన్‌పి అధ్యక్షురాలు, మాజీ ప్రధాని ఖలీదా జియాపై అవినీతి ఆరోపణలతో గృహనిర్బంధం విధించిన సంగతి తెలిసిందే. వేలాది మంది ప్రతిపక్ష నేతలు, వారి మద్దతుదారులను అరెస్ట్‌ చేశారు. ఎన్నికలను బహిష్కరిస్తూ బిఎన్‌పి పిలుపునిచ్చిన 48 గంటల దేశవ్యాప్త బంద్‌ శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ బంద్‌ సోమవారం ఉదయం 6 గంటలకు ముగియనుంది.

అమెరికా సహా కొన్ని దేశాలు విశ్వసనీయ, సంఘటిత ఎన్నికలకు పిలుపునివ్వడంతో భారత్‌కి చెందిన ముగ్గురు సహా 100 మంది విదేశీ పరిశీలకులు ఈ ఎన్నికలను  పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు అంతర్గత విషయం అని భారత్‌ పేర్కొంది. సుమారు 12 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఐదు పాఠశాలలు సహా రైలులోని నాలుగు కోచ్‌లను దుండగులు తగులబెట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.

➡️