ప్రతిఘటనా స్వరం ‘ప్రబీర్‌ పుర్కాయస్థ’

Mar 2,2024 07:14 #Editorial

సమాజానికి ప్రమాదమనే పేరుతో చేసే గాలింపులు (విచ్‌ హంట్స్‌), రాజకీయ వేధింపులు పుర్కాయస్థకు కొత్తేమీ కాదు. స్వాతంత్య్ర భారత దేశానికి ఉన్నంత వయసు ఆయనది. డెబ్బై అయిదేళ్ల పుర్కాయస్థ రచించిన ”కీపింగ్‌ అప్‌ ది గుడ్‌ ఫైట్‌: ఫ్రమ్‌ ది ఎమర్జన్సీ టు ది ప్రజంట్‌ డే” పుస్తకాన్ని లెఫ్ట్‌వర్డ్‌ వారు ప్రచురించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఆ పుస్తకంలో వివరించారు. ఎమర్జెన్సీకి, ”అప్రకటిత ఎమర్జెన్సీ”గా పిలువబడే ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న పోలికలను పుర్కాయస్థ తన మాటల్లో వివరించారు. అప్పుడూ, ఇప్పుడు కూడా అదే నిరంకుశత్వం ఉనికిలో ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించారు, ఇప్పుడు కూడా వాటిని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది.

                  ప్రజాస్వామ్యం తనంతట తానుగా స్వేచ్ఛకు హామీ ఇస్తుందా? లేక ఆ స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన అవసరం ఉందా? భారత మీడియాలో ప్రగతిశీల వర్గాల వారు పరిమిత మీడియాను, పరిమిత ప్రజాస్వామ్యంగా భావిస్తారు. 2014లో నూతన ప్రభుత్వ ఏర్పాటు తర్వాత… రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన స్వేచ్ఛను కూడా పొందలేక…దానిని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని గడచిన దశాబ్దం రుజువు చేసింది. అత్యంత పరీక్షా సమయాలలో దేశంలోని జర్నలిస్టులు, విద్యావేత్తలు, కార్యకర్తలకు ఇదొక సవాల్‌గా తయారైంది.వ్యక్తుల్ని, జర్నలిస్టుల్ని లక్ష్యంగా చేసుకోవడం కొత్తేమీ కాదు, అయితే ఎమర్జెన్సీ కాలంలో చేసిన విధంగా రాజ్యం పక్షపాత ధోరణితో ఉన్నప్పుడు, అలాంటి లక్ష్యం ఒక భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంటుంది. అమాయకులపై నేరాలు మోపడం లేక ఆర్థిక నేర్పాల్ని ఆరోపించి అనాగరిక చట్టాల కింద ప్రజల్ని నిర్బంధంలో ఉంచే శిక్షాపూరిత ప్రక్రియగా మారింది.

ప్రబీర్‌ పుర్కాయస్థ సుశిక్షుతుడైన ఇంజనీర్‌. పరిస్థితుల కారణంగా మీడియా వ్యక్తిగా మారిన ఆయన ఇటీవల వంద రోజుల జైలు నిర్బంధాన్ని పూర్తి చేశారు. ”న్యూస్‌ క్లిక్‌” ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడైన పుర్కాయస్థ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నిర్బంధంలో ఉంచారు. ఆయన అరెస్ట్‌ ద్వారా మీడియాలో, ముఖ్యంగా డిజిటల్‌ మీడియాలో పని చేస్తున్న వారికి అధికారులు ఒక హెచ్చరిక చేశారు.

రాజకీయ వేధింపులు, సమాజానికి ప్రమాదమనే పేరుతో చేసే గాలింపులు (విచ్‌ హంట్స్‌) పుర్కాయస్థకు కొత్తేమీ కాదు. స్వాతంత్య్ర భారత దేశానికి ఉన్నంత వయసు ఆయనది. డెబ్బై అయిదేళ్ల పుర్కాయస్థ రచించిన ”కీపింగ్‌ అప్‌ ది గుడ్‌ ఫైట్‌: ఫ్రమ్‌ ది ఎమర్జన్సీ టు ది ప్రజంట్‌ డే” పుస్తకాన్ని లెఫ్ట్‌వర్డ్‌ వారు ప్రచురించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఆ పుస్తకంలో వివరించారు. ఎమర్జెన్సీకి, ”అప్రకటిత ఎమర్జెన్సీ”గా పిలువబడే ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న పోలికలను పుర్కాయస్థ తన మాటల్లో వివరించారు. అప్పుడూ, ఇప్పుడు కూడా అదే నిరంకుశత్వం ఉనికిలో ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించారు, ఇప్పుడు కూడా వాటిని కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది.

నాటి ఎమర్జెన్సీ 1.0 ‘మీసా’ (మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌) చట్టాన్ని ఉపయోగిస్తే, కాంగ్రెస్‌ తీసుకొచ్చిన ‘ఉపా’ చట్టాన్ని …మరింత తీవ్రతరం చేసి నేటి ఎమర్జెన్సీ 2.0లో కేంద్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొచ్చింది. 2019లో ఆ చట్టానికి చేసిన సవరణల ప్రకారం నేరం చేయలేదని రుజువు చేసుకునే భారాన్ని నిందితునిపై మోపుతూ బెయిల్‌ను కూడా మినహాయించింది.

ఎమర్జెన్సీని ప్రకటించిన 3 నెలల తర్వాత 1975 సెప్టెంబర్‌ 25న జెఎన్‌యు విద్యార్థిగా ఉన్న పుర్కాయస్థను ఢిల్లీ పోలీసులు లాక్కెళ్ళారు. అతడు విద్యార్థి సంఘం కార్యకర్త. జెఎన్‌యు విద్యార్థి సంఘం ఆఫీసు బేరర్‌కు (తరువాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు) సన్నిహిత మిత్రుడు. పోలీసులు విద్యార్థి సంఘ అధ్యక్షుడు డి.పి.త్రిపాఠీ కోసం వెతుకుతూ పొరపాటున ప్రబీర్‌ పుర్కాయస్థను ఎత్తుకెళ్లారు. ఇదొక కిడ్నాపింగ్‌ కేసు. డి.పి.టి గా పిలువబడే త్రిపాఠీ, కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళడానికి, ఆ తరువాత నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు వామపక్ష విద్యార్థి రాజకీయాలకు సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత పోలీసులు త్రిపాఠీని కూడా నిర్బంధించారు.

వామపక్ష రాజకీయాలకు జెఎన్‌యు పెట్టని కోటగా ప్రసిద్ధి. ముందు జాగ్రత్త చర్య పేరుతో నిర్బంధాలు, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు, నిరసనల అణచివేతకు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా క్యాంపస్‌లో అన్ని రకాల వామపక్ష భావాలు కలిగిన విద్యార్థులు సమ్మెలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేవారు. క్యాంపస్‌ లోపలికి పోలీసుల ప్రవేశం అంత తేలికేమీ కాదు. కానీ ఇతర విద్యార్ధుల్ని తరగతులకు వెళ్ళనీయకుండా కొంత మంది విద్యార్థులు అడ్డుకుంటున్నారనే సాకుతో పోలీసులు క్యాంపస్‌ లోపలికి ప్రవేశించారు.

ఈ ప్రత్యేక కేసులో నాడు అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినిగా ఉన్న మేనకా గాంధీ ఫిర్యాదుపైనే పోలీసులు క్యాంపస్‌ లోకి ప్రవేశించారు. త్రిపాఠీ అనుకొని పొరపాటుగా అరెస్ట్‌ చేసినప్పటికీ పుర్కాయస్థ ‘మీసా’ చట్టం కింద సంవత్సరం పాటు జైలుశిక్ష అనుభవించారు. అంతేకాక ఆయనను ఏకాంత కారాగారంలో ఉంచారు. నిర్బంధంలో ఉండడం ఆయనకిది మొదటి పర్యాయం. సురేంద్ర మోహన్‌ లాంటి సోషలిస్టుల నుండి జనసంఫ్‌ు సభ్యుల దాకా ఒక స్థాయి రాజకీయ నాయకుల్ని కలిసే అవకాశం తనకెలా వచ్చిందో స్వీయ జ్ఞాపకాలలో వివరించారు పుర్కాయస్థ. జనసంఫ్‌ుకు చెందిన అరుణ్‌ జైట్లీ, మురళీ మనోహర్‌ జోషి లాంటి కొందరు నాయకులు కేంద్ర మంత్రులయ్యారు. ఒ.పి.కోహ్లీ లాంటి వారు రాజ్యసభ సభ్యులయ్యారు. తన కార్యకర్తల్ని ముందుగానే విడుదల చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ఆర్‌ఎస్‌ఎస్‌ రాయబారాలు, రాజీ ప్రయత్నాల గురించి తన రచనలో పుర్కాయస్థ వివరించారు.

సౌకర్యవంతమైన మధ్య తరగతి బెంగాలీ కుటుంబానికి చెందిన పుర్కాయస్థ ప్రయాణం స్వీయ పరివర్తనతో ప్రారంభమైంది. తన రాజకీయ ప్రస్థానం గురించి, సిపిఎం పార్టీలో కార్యకర్తగా మారడానికి తోడ్పడిన ప్రాపంచిక ఆలోచనల్ని ఈ పుస్తకం బహిర్గతం చేసింది. ”మీరు ఎటువైపు ఉన్నారన్నదే అసలు ప్రశ్న” అంటారాయన. ”నైతిక పోరాటం” అంటే ఏమిటి లేక నైతిక పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమిటి, ఎవరు నైతిక పోరాటం చెయ్యాలనేది ఆయన వేస్తున్న కొన్ని ప్రశ్నలు. వార్తల్లో నిలిచిపోవాలనే కోరిక తనకు లేదనీ, ”నైతిక పోరాటం” తనతోనే మొదలై, తనతోనే అంతం కాని విషయం స్పష్టమని అంటారు.న్యాయం, శాస్త్రీయ ఆలోచన, సమ దృష్టి వంటి లక్షణాలు గల వ్యక్తిగా తన పరిణామ క్రమాన్ని, వ్యక్తిగత, రాజకీయ జ్ఞాపకాలతో కూడిన ఈ పుస్తకం మన ముందు వుంచుతుంది. పుస్తకం రెండు కాలాల మధ్య ఉన్న తేడాల్ని చూపించినప్పటికీ, ”75 ఏళ్ళ లౌకిక, ప్రజాస్వామిక, రాజ్యాంగ నిర్దేశిత భారత గణతంత్ర సందర్భాన్ని” దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని పుర్కాయస్థ పేర్కొంటారు.

హేతువాది నరేంద్ర దభోల్కర్‌, స్కాలర్‌ ఎంఎం కల్బుర్గి, కార్మిక సంఘ నాయకుడు, హేతువాది గోవింద్‌ పన్సారే, ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ లాంటి వారి హత్యల్ని, భీమా కోరేగావ్‌ కేసులో ‘ఉపా’ చట్టం కింద జైలు నిర్బంధంలో ఉన్న మేథావులు, కార్యకర్తల అరెస్ట్‌ను ఆయన గుర్తు చేసుకుంటారు. నిర్బంధంలో ఉన్న వారు తమకు నచ్చిన మార్గంలో నిరసించే ప్రజాస్వామిక హక్కు, హేతుబద్ధత కోసం నిలబడి… ప్రతీఘాత, మతవాద, మితవాద హిందూత్వను సవాల్‌ చేశారు. ఈ మితవాద ఆధిపత్య కాలంలో, మతాంతర వివాహాలు చేసుకునే వారిపైన, గోరక్షణ పేరుతో మైనార్టీలపైన దాడులు సర్వసాధారణమయ్యాయి.

పుర్కాయస్థ ‘న్యూస్‌ క్లిక్‌’ను 2009లో ప్రారంభించారు కానీ దానిని ఒక ప్రత్యేకమైన సంస్థగా భావించలేదు. ఇతర కొన్ని డిజిటల్‌ వేదికలు, ప్రధాన మీడియా స్రవంతి మాదిరిగా ”ప్రజలపై దాడులు, జీవనోపాధి, హేతుబద్ధత”కు ముప్పు వాటిల్లినపుడు ప్రతిస్పందనగా వచ్చిన ప్రజల నిరసనలను ‘న్యూస్‌ క్లిక్‌’ కూడా ప్రపంచానికి తెలియజేస్తున్నది. ఇటువంటి ఘటనల కారణంగా రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, మేథావి వర్గానికి చెందిన అనేకమంది తమ సురక్షిత వలయాల నుండి బయటకి వస్తున్నారు. పుర్కాయస్థ భాగస్వామిగా ఉన్న శాస్త్ర విజ్ఞాన రంగం కూడా తన వంతు పాత్రను పోషించింది.

ప్రధాన స్రవంతి మీడియా అందించని నివేదికలు, అభిప్రాయాల్ని కూడా ‘న్యూస్‌ క్లిక్‌’ అందించింది. మీడియాలో కొన్ని రకాల నివేదికలు, బహుశా మీడియా వర్గ లక్షణాన్ని ఉద్దేశపూర్వకంగా మినహాయించడం గురించి వివరిస్తూ, కార్మికులు నగరంలో ప్రదర్శనలు చేస్తుంటే, ఆ కార్మికుల డిమాండ్ల గురించి కంటే కూడా ఆ ప్రదర్శనల వల్ల కలిగే ట్రాఫిక్‌ జామ్‌ గురించి వార్తలు ఎక్కువగా రాస్తుండడం తాను గమనించానని పుర్కాయస్థ పేర్కొంటారు.

గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రధాన స్రవంతిలోని కొన్ని మీడియా వర్గాలు గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కోవిడ్‌-19 వల్ల సంభవించిన అదనపు మరణాల గురించి నివేదించాయి. దాంతో, తమ కార్యాలయాలపై ఆదాయ పన్నుల శాఖ దాడులతో అవి భారీ మూల్యాన్ని చెల్లించాయి.

ఈ పుస్తకంలో 7 అధ్యాయాలు, 2 అనుబంధాలు, లలితా రామ్‌ దాస్‌ ముందుమాట ఉన్నాయి. పుర్కాయస్థ ఈ పుస్తకాన్ని రచిస్తున్నప్పటికే మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద ‘న్యూస్‌ క్లిక్‌’పై రెండు పర్యాయాలు దాడులు జరిగాయి. ఆరోపణలను సవాల్‌ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. 2023 అక్టోబర్‌ 3న పుర్కాయస్థ తన సహచరునితో సహా అరెస్టయ్యారు. ఆ అరెస్ట్‌ను కూడా కోర్టులో సవాల్‌ చేశారు. రెండు వారాల అనంతరం, న్యూస్‌ క్లిక్‌ సిబ్బందికి జీతాలు అందనివిధంగా కంపెనీ ఖాతాల్ని స్తంభింపచేశారు.

పదేపదే జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించడంతో పుర్కాయస్థ ఇప్పటికీ జైల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యలున్నప్పటికీ ఆయన స్ఫూర్తి ఏమాత్రం చెదరలేదు. ‘న్యూస్‌ క్లిక్‌’ సంస్థ నిధుల్ని స్తంభింపజేసినప్పటికీ వార్తల్ని అందించే పనిని కొనసాగిస్తున్నది. న్యూ ఢిల్లీలోని ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో పుస్తకాన్ని ఆవిష్కరించిన రోజున, స్నేహితులు, సహచరులు, సానుభూతిపరులతో హాలు నిండిపోయింది.

1977 ఎమర్జెన్సీని తిరస్కరించిన వారిలో సాధారణ ప్రజలే ప్రధాన పాత్రధారులు. ప్రస్తుత సమయంలో దాడి తీవ్రత ఎక్కువగా ఉంటే అదే స్థాయిలో ప్రతిఘటన కూడా ఉంటుంది. ”నాయకులు, అనుమతించిన దానికి మించి వ్యవహరిస్తే అదే ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తార”ంటారు ప్రబీర్‌ పుర్కాయస్థ తన పుస్తకంలో.

(''ఫ్రంట్‌ లైన్‌'' సౌజన్యంతో)టి.కె. రాజాలక్ష్మి
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)టి.కె. రాజాలక్ష్మి
➡️