రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్‌

  • 87 శాతం ఓట్లతో ఐదోసారి ఘన విజయం

మాస్కో : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఆ దేశ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (సిఇసి) సోమవారం అధికారికంగా ప్రకటించింది. పోలైన ఓట్లలో పుతిన్‌కు 87.28 శాతం ఓట్లు, కమ్యూనిస్ట్‌ పార్టీ అభ్యర్థి నికోలవ్‌ ఖరితోనోవ్‌కు 4.31 శాతం, న్యూ పీపుల్‌ పార్టీ అభ్యర్థి వ్లాదిస్లావ్‌ డెవన్‌కోవ్‌కు 3.85 శాతం, లిబరల్‌ డెమొక్రాట్స్‌ అభ్యర్థి లెనిడ్‌ స్లుత్‌స్కీకు 3.20 శాతం ఓట్లు వచ్చాయి. పుతిన్‌ అభ్యర్థిత్వానికి ఏడు కోట్ల 50 లక్షలకుపైగా ఓటర్లు మద్దతు పలికారు. 200 నుంచి 2008 వరకూ అధ్యక్షుడిగానూ, 2008 నుంచి 2012 వరకూ ప్రధానిగానూ, మళ్లీ 2012 నుంచి ఇప్పటివరకూ అధ్యక్షుడిగానూ పుతిన్‌ బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికతో 2030 వరకూ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74 శాతం ఓటింగ్‌ నమోదయింది. 2018 ఎన్నికల్లో 67.47 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదయింది. పుతిన్‌ ఎన్నికకావడం పట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, ఇరాన్‌ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్‌ జోంగ్‌ఉన్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

➡️