టిడిపిలో కమలం చిచ్చు

Mar 13,2024 09:24 #Electoral Alliance, #TDP

 విజయనగరం, అరకు పార్లమెంట్‌ స్థానాలను బిజెపికి వదిలేసిన అధిష్టానం
నెల్లిమర్లలో ఉనికి కోల్పోతామంటూ ఆందోళన
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయనగరం, పార్వతీపురం జిల్లాల టిడిపిలో కమలం చిచ్చురేపింది. పొత్తులో భాగంగా టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా వ్యతిరేకత ప్రదర్శిస్తునే ఉన్నారు. ఇది చల్లారకముందే బిజెపితో పొత్తు కుదుర్చుకోవడం, విజయనగరం, అరకు పార్లమెంట్‌ స్థానాలు బిజెపికి కేటాయిస్తున్నట్టు వెల్లడించడంతో ఈ రెండు జిల్లాల్లోనూ టిడిపి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బిజెపితో పొత్తు పేరిట విజయనగరం పార్లమెంట్‌ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల టిడిపి కేడర్‌ బిజెపి అభ్యర్థికి ఓటు వేయాల్సి రావడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నెల్లిమర్లలో అయితే, సైకిల్‌ గుర్తుకు ఓటేసే అవకాశమే లేని దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా నాయకులు మొదలుకుని, సామాన్య కార్యకర్తల వరకు తీవ్ర ఆవేదనతో అధిష్టాన వైఖరిని తప్పు పడుతున్నారు. బిజెపితో జతకడితే మొదటికే మోసం జరుగుతుందంటూ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం మదనపడుతున్నట్లు తెలిపారు. సాలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు మరో అడుగు ముందుకు వేసి ‘అరకు పార్లమెంట్‌ బిజెపికి ఇవ్వకుండా మీరంతా సిఫార్సు చేయండి’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంతలా మదన పడుతున్న టిడిపి శ్రేణులు, నాయకులు బిజెపికి ఎలా పనిచేస్తారన్నది విశ్లేషకుల ప్రశ్న. పార్లమెంట్‌ అభ్యర్థి వ్యక్తిగత చర్మిష్మా దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు ఎంతో కొంత ఉపయోగపడవచ్చన్నది సర్వ సాధారణం. కానీ, అదే ఎంపీ అభ్యర్థి బిజెపి తరపున పోటీ చేయడంతో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోందని పలువురు టిడిపి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లపాటు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన బిజెపి విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్‌, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు హామీ కూడా అమలు చేయలేదు. చివరకు విభజన హామీల్లో భాగంగా జిల్లాకు మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీకి కూడా తగిన నిధులు కేటాయించలేదు. దీంతో, ఆ వర్సిటీ ప్రస్తుతం అసౌకర్యాలు, సమస్యల నడుమ పరాయి పంచన నడుస్తోంది.
ఈ నేపథ్యంలో బిజెపి అభ్యర్థులకు ప్రజలు సహకరించే పరిస్థితి లేదని, ఆ ప్రభావం టిడిపి తరుఫున పోటీ చేసే అభ్యర్థులపైనా పడనుందని, ఇంతనష్టం మనకి అవసరమా? అని టిడిపిలో చర్చ నడుస్తోంది. సొంతపార్టీకి ఒక్క ఓటు కూడా వేసుకునే అవకాశం లేకపోవడంతో నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

➡️