మెగా సిటీగా విశాఖ : సిఎం జగన్‌ 

Mar 6,2024 08:49
  • పదేళ్లలో రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు
  • విజన్‌ విశాఖ డాక్యుమెంట్‌ విడుదలలో సిఎం జగన్‌
  • రెండవ సారి సిఎంగా ప్రమాణం.. పాలన ఇక్కడ నుండే

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రానున్న పదేళ్ల కాలంలో రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులకు వేదికగా విశాఖను తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌, రాడిసన్‌ బ్లూ హోటల్‌లో మంగళవారం ఆయన విజన్‌ విశాఖ డాక్యుమెంటును ఆవిష్కరించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యుత్తమ ప్రగతి కేంద్రాలతో చేయి కలిపి తూర్పు తీరంలో మెగా సిటీగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. అగ్రగామి పారిశ్రామికవేత్తలంతా వైజాగ్‌ను ఫిన్‌-టెక్‌ క్యాపిటల్‌గా చూస్తున్నారని, అమరావతితో పోలిస్తే వైజాగ్‌ను రాజధానిగా చేయడానికి సహజమైన భౌగోళిక వెసులుబాటు ఉందన్నారు. హైదరాబాద్‌ – వైజాగ్‌ – విజయవాడ – బెంగళూరు మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల కోసం సంప్రదిస్తున్నట్లు తెలిపారు. వీటన్నింటితోపాటు విశాఖకు ముఖ్యమంత్రి వస్తే రానున్న పదేళ్లలో వైజాగ్‌ దేశంలోని అత్యుత్తమ నగరాలతో పోటీపడుతుందన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తా. సిఎంగా రెండవసారి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా. ఎన్నికల తర్వాతే రాష్ట్ర రాజధానిగా విశాఖ ఉంటుంది. ఇక్కడ నుంచే పాలన సాగిస్తా’ అని చెప్పారు. ఉత్పత్తి రంగంలో దేశంలోనే మన రాష్ట్రం మెరుగ్గా ఉందని చెప్పారు. విశాఖను ‘ఎకనమిక్‌ గ్రోత్‌ ఇంజన్‌’లా మార్చే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. దేశాన్ని ఆకర్షించే ‘ఐకానిక్‌ సెక్రటేరియట్‌’ విశాఖలో నిర్మిస్తామన్నారు. రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు భవిష్యత్‌ ప్రగతిలో ఎంతో కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. పదేళ్లలో పెట్టుబడుల రాకతోపాటు కారిడార్‌ల అభివృద్ధి, మెట్రో లైన్‌ ఏర్పాటు, భోగాపురం ఎయిర్‌పోర్టు, ఇవన్నీ రావడం ద్వారా హైదరాబాద్‌, చెన్నరు, బెంగళూరుతో పోటీగా విశాఖ ఎదుగుతుందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని, గత నాలుగేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. గతేడాది విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్లకుపైగా 352 ఎంఒయులు జరగ్గా ఆరు లక్షల మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు. 39 శాతం ఒప్పందాలు ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కార్యరూపంలోకి వచ్చాయన్నారు. అనంతరం నగరంలోని పిఎం.పాలెంలో ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యాన జరిగిన ‘భవిత’ కార్యక్రమాన్ని సిఎం ప్రారంభించారు. పారిశ్రామిక నైపుణ్యాలను అందిపుచ్చుకునే శ్రామికశక్తిని అభివృద్ధి చేయాలన్నారు.

రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్‌నాథ్‌, విడదల రజని తదితరులు పాల్గొన్నారు.

➡️