‘ఉక్కు రక్షణకై ధూంధాం’ పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 7,2023 09:10 #visakha steel
visakha-steel-plant jobs cut by govt

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం): ప్రజానాట్య మండలి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో గాజువాకలంక గ్రౌండ్‌లో నిర్వహించనున్న ‘ఉక్కు రక్షణకై ధూంధాం’ కార్యక్రమ పోస్టర్‌ను విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఆవిష్కరించారు. పోస్టర్‌ను సినీ డైరెక్టర్‌ యాద్‌ కుమార్‌ ఆవిష్కరించి మాట్లాడుతూ.. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలని చూడడం దారుణమన్నారు. ఈ కర్మాగారం పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజానాట్య మండలి చేపట్టిన ధూం ధాం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎం.చంటి మాట్లాడుతూ.. నాలుగు రోజులపాటు జరిగే ఈ ధూంధాంలో సుమారు వెయ్యి మంది కళాకారులు పాల్గొని, ప్రదర్శనలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఉక్కు రక్షణకు తాము బహుముఖ కార్యక్రమాలు తలపెట్టామని, భవిష్యత్తులో పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సంఘం జిల్లా నాయకులు వై.అప్పారావు మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యాలు, నాటికలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, చెక్కభజనలు, కూచిపూడి నృత్యాలు, మిమిక్రీ, మ్యాజిక్‌ షో, స్టేజీ నాటికలు, బృంద గానాలు వంటి కళారూపాలు ప్రదర్శించడానికి వందలాది మంది కళాకారులు తరలిరానున్నారని చెప్పారు. విశాఖలోని కవులు, కళాకారులు, కళా సంస్థలు ధూంధాంకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

➡️