ప్రయివేట్‌ దిశగా విశాఖ పోర్టు !

Mar 3,2024 10:36
  • పిపిపి కిందికి ఇన్నర్‌, అవుటర్‌ హార్బర్‌ల్లో 20 బెర్తులు
  • రిజర్వు ఆదాయం డిపాజిట్లలో నిబంధనల ఉల్లంఘన

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన విశాఖ పోర్టు క్రమేపీ ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లోకి జారిపోతోంది. ఈ పోర్టు విశాఖ నగరం అభివృద్ధి, పోర్టు ఆధారిత పరిశ్రమలకు ఊతమివ్వాల్సి ఉంది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంది. కానీ, పోర్టులో 2009 తర్వాత పర్మినెంట్‌ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ పూర్తిగా నిలిచిపోయింది. ఐదు వేలకుపైగా రెగ్యులర్‌ ఉద్యోగుల ఖాళీలు భర్తీ కాలేదు. బెర్తులపైనా, కార్యాలయాల్లోనూ కాంట్రాక్టు ఉద్యోగులతో పని చేయిస్తున్నారు. పోర్టు ఏర్పాటు నిబంధనల్లోనే ఉపాధి, విశాఖ నగర అభివృద్ధికి తోడ్పాటు అన్న షరతు ఉందని సీనియర్‌ పోర్టు అధికారులు గుర్తు చేస్తున్నారు. క్రమంగా విశాఖ పోర్టు ప్రయివేటు వైపునకు సాగుతోంది. పోర్టు బెర్తుల్లో 20 వరకూ ఇప్పటికే పిపిపిలోకి వెళ్లిపోవడంతో ఉపాధికి గండిపడి పోర్టు ఏర్పాటు లక్ష్యం నీరుగారుతోంది.

పోర్టులో ఏం జరుగుతోంది ?

             కేంద్రంలోని బిజెపి సర్కారు తెచ్చిన మేజర్‌ పోర్టుల అథారిటీ బిల్లు అమలుతో విశాఖ పోర్టు ప్రయివేట్‌ వ్యక్తులకు ఫలహారంగా మిగిలిపోతోందన్న విమర్శలూ ఉన్నాయి. పిపిపి విధానంతో వ్యాపారం చేస్తూ ల్యాండ్‌ పోర్టు అయిందంటూ కేంద్ర ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటోంది. ఏటా పోర్టుకు వచ్చే రూ.1200 కోట్ల సరుకు రవాణా వ్యాపార ఆదాయంలో రూ.800 కోట్లు ఖర్చులకుపోగా మిగిలిన రూ.400 కోట్లు ఆపరేషనల్‌ లాభం వస్తోంది. బిజెపి నిర్ణయంతో గత పదేళ్లలో మొత్తం రూ.4 వేల కోట్లు ఆపరేషన్‌ లాభాలు ప్రయివేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌గా ఉంచారు. పోర్టు నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్యాంకులు (ఎల్‌ఐసి, షెడ్యూల్డ్‌ బ్యాంకులు)ల్లో ‘పోర్టు రిజర్వు ఆదాయం’ ఉంచాలి. ప్రయివేట్‌ బ్యాంకుల్లో ఉంచడంతో డబ్బు భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

పిపిపితో ఏమైనా లాభం ఉందా ?

              ఏటా పిపిపి ద్వారా పోర్టుకు రూ.150 కోట్లకు మించి ఆదాయం లేదు. ఇక్యూ-1 బెర్తును పదేళ్ల క్రితం అదానీకి ఇచ్చి పోర్టు యాజమాన్యం చేతులు కాల్చుకుని రూ.కోట్ల నష్టాన్ని ఏళ్ల తరబడి చవిచూసింది. పిపిపి విధానంలో ఇలాంటివి పోర్టును వెంటాడుతున్నా అధికారులు దాచి పెడుతున్నారు. సుమారు ఏడు బెర్తుల్లో ఇదే స్థితి ఉన్నా పోర్టు యాజమాన్యం కిమ్మనడం లేదు. అదానీ తరహా అనుభవం పునరావృత్తమైతే చేతులెత్తేయడం తప్ప మరోదారి ఉండదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.

ఉద్యోగుల్లో ఆందోళన

               వేలల్లో ఉన్న పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య 2009 నుంచి రిక్రూట్‌మెంట్‌ లేనందున వందల సంఖ్యకు పడిపోయింది. ఉద్యోగులు తక్కువ మంది ఉన్నా కష్టించి పనిచేయడంతో సరుకు రవాణాలో లక్ష్యాలను పోర్టు అధిగమిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో 73 మిలియన్‌ టన్నుల సరుకును విశాఖ పోర్టు రవాణా చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 80 మిలియన్‌ టన్నులు సాధించే దిశగా కృషి జరుగుతోంది.

భూములకూ ఎసరొచ్చింది ?

               శాలిగ్రాంపురం, మల్కాపురం, కంచరపాలెం (సాంబమూర్తినగర్‌)లో పోర్టు క్వార్టర్స్‌ వందల ఎకరాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ లీజుకిచ్చేయడానికి పోర్టు యాజమాన్యం నిర్ణయించింది. పోర్టు వీటిని అమ్ముకునే వీల్లేకపోయినా మేజర్‌ పోర్టుల అథారిటీ బిల్లు అమలు కాక ముందే విశాఖ పోర్టులో దుందుడుకుగా ముందుకెళ్తున్నారు. రహేజా కంపెనీకి రూ.400 కోట్ల విలువైన 27 ఎకరాలను కేవలం రూ.120 కోట్లకే లీజుకు పోర్టు యాజమాన్యం ఇదివరకే ఇచ్చేసింది. విసిటిపిఎల్‌, విసిటిపిఎల్‌-2 ప్రయివేట్‌ సంస్థలకు 80 ఎకరాలు కట్టబెట్టింది. 5.91 ఎకరాల్లో 1984లో ఏర్పాటు చేసిన పోర్టు ఆస్పత్రిని కూడా రూ.263 కోట్లకు పిపిపిలో ఇచ్చేసింది. ఇన్నర్‌ హార్బర్‌లో 11, అవుటర్‌ హార్బర్‌లో 9 బెర్తులను ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించింది.

➡️