మిమ్స్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరు ఉధృతం

  •  ర్యాలీ, రహదారి దిగ్బంధం

ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. మిమ్స్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామతీర్థం కూడలిలో రాస్తారోకో చేశారు. ముందుగా మొయిద జంక్షన్‌ నుంచి రామతీర్థం జంక్షన్‌ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రహదారిని దిగ్బంధించి ధర్నా చేశారు. చంద్రంపేట, కొండగుంపాం, గరికిపేటకు చెందిన వైసిపి నాయకులు, టిడిపి నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడుతూ.. కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న మిమ్స్‌ యాజమాన్యానికి ప్రభుత్వం వత్తాసు పలకడం భావ్యం కాదన్నారు. మిమ్స్‌ యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన నేపథ్యంలో సిఐటియు నాయకులు జగన్మోహన్‌ను నెల్లిమర్ల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు.ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా లా అండ్‌ ఆర్డర్‌ సమస్యకు కారణమైన యాజమాన్యాన్ని వదిలేసి సిఐటియు నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కిల్లంపల్లి రామారావు, ఫేకర్‌ యూనియన్‌ నాయకులు అంబళ్ల గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పోరాటానికి వైసిపి, టిడిపి నాయకులు మద్దతు తెలిపారు.

➡️