కొడిగట్టిన మానవ హక్కులు

Dec 11,2023 11:00 #israel hamas war

 

గాజాలో ఇజ్రాయిల్‌ దాష్టీకాలకు అంతం లేదా?

మృతప్రాయమైన ఐరాస డిక్లరేషన్‌

గాజా స్ట్రిప్‌ : 1948 డిసెంబర్‌ 10వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలన్నింటికీ వర్తించేలా మానవ హక్కుల డిక్లరేషన్‌ను ఆమోదించింది. అయితే ఇప్పుడు దానికి అర్థమేముంది? విలువ ఏముంది? అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని అన్ని దేశాలు ఆదివారం ఘనంగా జరుపుకున్నాయి. మానవ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ గొప్పగా ప్రతిజ్ఞలు చేశాయి. అయితే ఇజ్రాయిల్‌ దాడులతో భీతిల్లుతున్న గాజా నుండి వస్తున్న వార్తలు, చిత్రాలు ఈ ప్రతిజ్ఞలను అవహేళన చేస్తున్నాయి. హమాస్‌ మిలిటెంట్లు అక్టోబర్‌ 7న దాడులు జరిపి అనేక మంది ఇజ్రాయిలీలను హతమార్చిన మర్నాడే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ప్రకటించింది. అప్పటి నుండి ఇజ్రాయిల్‌ దళాలు జరుపుతున్న వైమానిక దాడులు, కురిపిస్తున్న బాంబుల వర్షం కారణంగా పదిహేను వేల మంది పాలస్తీనియన్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వీరిలో ఆరు వేల మంది అభం శుభం తెలియని చిన్నారులేనన్న కఠోర వాస్తవం హృదయాలను కదిలించివేస్తోంది. ఇప్పుడు 1948 డిసెంబర్‌ 10న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన మానవ హక్కుల డిక్లరేషన్‌లో ఏముందో చూద్దాం…’మానవ కుటుంబంలోని సభ్యులందరి స్వాభావిక గౌరవానికి, సమానమైన, విడదీయరాని హక్కులకు గుర్తింపు అనేది ప్రపంచంలోని స్వేచ్ఛ, న్యాయం, శాంతికి పునాది’ అని ఆ డిక్లరేషన్‌ తెలిపింది. అయితే మానవ హక్కుల దినోత్సవం రోజున ఆ డిక్లరేషన్‌ మృతప్రాయమైపోయింది. అంతకుముందు కూడా తమ విదేశీ విధాన లక్ష్యాలను సాధించడానికి సంపన్న, పశ్చిమ దేశాలు మానవ హక్కులను ఓ ఆయుధంగా వాడుకున్నాయన్నది సుస్పష్టం. మానవ హక్కుల డిక్లరేషన్‌కు కొద్ది నెలల ముందు ఇవే పశ్చిమ దేశాల సాయంతో ఇజ్రాయిల్‌ దేశం ఉనికిలోకి వచ్చింది. ఫలితంగా ఏడున్నర లక్షల మంది పాలస్తీనియన్లను తమ నివాసాల నుండి, మాతృభూమి నుండి తరిమేశారు. ఇజ్రాయిల్‌లోని 80% జనాభా దేశం నుండి బహిష్కరణకు గురికావడమో లేదా పొరుగు దేశాలకు పారిపోయి అక్కడ చెప్పుకోవడానికి తమకు దేశమన్నదేలేని స్థానికులుగా మిగిలిపోవడమో జరిగింది. చలనం లేని ఇజ్రాయిల్‌మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఇజ్రాయిల్‌ ఎంత మాత్రం చలించడం లేదు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్‌ నిరంతరాయంగా యుద్ధం చేస్తోంది. సాయుధ ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలలో సైతం పౌరులకు రక్షణ కల్పించాలన్న ఐరాస ప్రాథమిక సూత్రాలను కూడా తుంగలో తొక్కుతోంది. పాలస్తీనా ప్రజల, ఆక్రమిత ప్రాంతాలలోని ఇతర అరబ్బుల మానవ హక్కులకు భంగం కలిగేలా ఇజ్రాయిల్‌ చేపట్టిన చర్యలపై విచారణ జరిపేందుకు ఐరాస 1968లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అక్రమంగా నివసిస్తున్న వారు ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఇటీవల విడుదలైన ఓ నివేదిక తెలిపింది. మానవ హక్కుల డిక్లరేషన్‌కు కట్టుబడి ఉండాలంటూ 1970 డిసెంబర్‌ 15న ఆమోదించిన తీర్మానంలో ఐరాస సర్వసభ్య సమావేశం ఇజ్రాయిల్‌ను కోరింది. 1989లో బాలల హక్కులపై ఐరాస కన్వెన్షన్‌ను ఆమోదించారు. దీనిని 1991లో ఇజ్రాయిల్‌ సమర్ధించింది. అయితే వెస్ట్‌బ్యాంక్‌కు ఇది వర్తించదంటూ మెలిక పెట్టింది. గాజా స్ట్రిప్‌లో బాలల హక్కుల ఉల్లంఘనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఐరాస నడుపుతున్న పాఠశాలలు సహా విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. చిన్నారులపై యధేచ్ఛగా బాంబు దాడులు జరుగుతున్నాయి. మానవ హక్కులకు సంబంధించిన ఐరాస తీర్మానాలపై ఇజ్రాయిల్‌ 1991 వరకూ సంతకమే చేయలేదు. పైగా పాలస్తీనా ప్రజల హక్కులను నిరాకరిస్తూ 2018లో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. రోజుకు 170 మంది చిన్నారులు బలిగాజాపై యుద్ధం చేసిన 40 రోజులలో ప్రతి రోజూ ఇజ్రాయిల్‌ 170 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నదని అల్‌ జజీరా ఛానల్‌ తెలిపింది. చిన్నారులకు గాజా స్మశానవాటిక అయిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరస్‌ నవంబర్‌ 6న ప్రకటించారు. జరుగుతున్న దారుణాలకు ఇజ్రాయిల్‌ను బాధ్యురాలిని చేయడంలో ప్రపంచదేశాలు విఫలమయ్యాయని పాలస్తీనియన్‌ క్రానికల్‌ పత్రిక ఆరోపించింది. మొత్తంమీద మానవ హక్కుల డిక్లరేషన్ల ఉనికిని నాశనం చేసేందుకు బాంబు దాడులు జరుగుతున్నాయి. ఆ డిక్లరేషన్లు చిన్నారుల మృతదేహాలతో నిండిపోయిన గాజా శిథిలాల కింద తగలబడుతున్నాయి.

➡️