అనంత కలెక్టర్‌గా వినోద్‌కుమార్‌, ఎస్పీగా అమిత్‌ బర్దార్‌

కలెక్టర్‌గా వినోద్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌ బర్దార్‌

     అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్‌గా డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, ఎస్పీగా అమిత్‌ బర్దార్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గురువారం సాయంత్రమే జిల్లా ఎస్పీగా అమిత్‌ బర్దార్‌ బాధ్యతలు చేపట్టారు. వినోద్‌ కుమార్‌ శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు మునుపున్న కలెక్టర్‌ ఎం.గౌతమి, ఎస్పీ అన్బురాజన్‌ను ఎన్నికల సంఘం బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. వారి స్థానంలో ఇద్దరినీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అనంత అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ వినోద్‌ కుమార్‌

         2015 బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ కొంతకాలం అసిస్టెంట్‌ కలెక్టరుగా అనంతలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన స్కిల్‌డెవలప్‌మెంట్‌ సిఇఒగా పనిచేస్తున్నారు. అంతకు మునుపు తూర్పుగోదావరి జిల్లాలో హెల్త్‌ విభాగంలో పనిచేశారు. ఆయన్ను ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. వెంటనే బాధ్యతలు చేపట్టాలని పేర్కొనడంతో విజయవాడ నుంచి వచ్చి శుక్రవారం రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. వినోద్‌కుమార్‌ తొలిసారిగా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో సమస్యాత్మకమైన అనంతపురం జిల్లాలో ఏ మేరకు నెట్టుకురాగలరన్నది చూడాల్సి ఉంది.

ఎస్పీగా అమిత్‌ బర్దార్‌

          అనంతపురం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌ నియమితులయ్యారు. అనంతపురం ఎపి ఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌ పనిచేస్తున్నారు. అంతకు మునుపు ఆయన సిఐడి ఎస్పీగా పనిచేశారు. 2019 ముందు శ్రీ కాకుళం ఎస్పీగా పనిచేశారు. ఇప్పుడు ఆయన్ను జిల్లా ఎస్పీగా నియమించారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే సాయంత్రం ఆయన ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఇద్దరు కొత్తవారే..

           జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఒకేసారి మార్పు జరగడంతో ఇద్దరూ కొత్త అధికారులే ఆ బాధ్యతల్లోకి వచ్చారు. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అనేక లోపాలున్నాయి. అవే గత కలెక్టర్‌ ఎం.గౌతమిపై వేటుకు కారణమయ్యాయి. కొత్త కలెక్టర్‌ వీటిని ఏ రకంగా సరిచేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇకపోతే సమస్యాత్మకమైన అనంతపురం జిల్లాలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కత్తి మీద సామే అవుతుంది. ఇప్పటికే ఎప్పుడూ సమస్యాత్మకంగా ఉండే నియోకవర్గాలు ప్రాంతాలున్నాయి. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు ఏ రకంగా తీసుకోగలరన్నది చూడాల్సి ఉంది. సమయం కూడా చాలా తక్కువగా ఉండటంతో వీటన్నింటిని సమన్వయం చేయడం ఇద్దరికీ పెద్ద సవాల్‌గానే మారనుంది.

➡️