అమెరికాకు ఆ నైతిక హక్కు లేదు!

Jan 26,2024 11:24 #America, #Venezuela
venezuela on america

వెనిజులా ప్రభుత్వం

కారకస్‌ : వెనిజులాను అస్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తలను అరెస్టు చేయడంపై అమెరికా వ్యతిరేకంగా స్పందించడాన్ని వెనిజులా బుధవారం కొట్టిపారేసింది. దేశంలో శాంతిని పరిరక్షించేందుకు వెనిజులా ప్రభుత్వం తీసుకునే చర్యలను ఖండించే నైతికత అమెరికా ప్రభుత్వానికి లేదని వెనిజులా విదేశాంగ మంత్రిత్వ వాఖ ఒక ప్రకటనలో విమర్శించింది. వెనిజులాల్లో తీవ్రవాద చర్యలకు పాల్పడేవారికి అనుకూలంగా వాషింగ్టన్‌ మాట్లాడడం తమకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదని, పైగా వారికి సహకరిస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. దేశంలో అస్థిరతను రాజేసి, హింసకు, బెదిరింపులకు పాల్పడాలన్నది వారి లక్ష్యంగా వుందని విమర్శించింది. ఈ ఏడాది జరిగే వెనిజులా ఎన్నికలతో దేశంలో శాంతికి హామీ దొరుకుతుందని పేర్కొంది. దేశాన్ని అస్థిరీకరించేందుకు అమెరికా గతేడాది నుండి పన్నిన ఐదు కుట్రలను భగం చేసినట్లు వెనిజులా అధికారులు తెలిపారు. అందులో వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోని హత్య చేసేందుకు పన్నిన కుట్ర కూడా వుందన్నారు. ఈ కుట్రలకు సంబంధించి 30 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేయాల్సిందిగా వెనిజులా ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ అరెస్టు ఆదేశాల పట్ల తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామంటూ అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వ్యతిరేక కుట్రకు పాల్పడినందుకు వెనిజులా సాయుధ బలగాల నుండి 33మందిని బహిష్కరించారు. వీరిలో సైనికులు, ఉన్నత స్థాయి అధికారులు వున్నారని వెనిజులా రక్షణ శాఖ బుధవారం తెలిపింది. చట్టబద్ధ:గా ఏర్పడిన ప్రభుత్వంపై దాడి చేయడానికి క్రిమినల్‌, తీవ్రవాద చర్యలకు దిగాలని వీరు కుట్రలు పన్నారని రక్షణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బొలివారియన్‌ జాతీయసాయుధ బలగాలు (ఎఫ్‌ఎఎన్‌బి) నైతిక ప్రమాణాలకు అనుగుణంగా వారికి సైనిక హోదా తొలగించింది.

➡️