నెంబర్ లేని వాహనాలు : బియ్యం అక్రమాలకు సిద్దమైనట్లు ఆరోపణలు

Dec 29,2023 23:44

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఒకటవ తేదీ నుండి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేసే రేషన్‌ బియ్యం డీలర్లకు చేరుతున్నాయి. బియ్యం పంపిణీ ప్రారంభమైన రెండు, మూడు రోజుల నుండి డీలర్ల వద్ద ఉన్న బియ్యం పంపిణీ వాహనాలతో అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులకు సిద్దమవుతున్నారు. ఈ బియ్యాన్ని తరలించేందుకు గ్రామంలో అక్రమ వ్యాపారులు దాదాపు నాలుగైదు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సిద్ధం చేసి ఉంచారు. ప్రతినెల అక్రమ బియ్యం ఈ నెంబర్ ప్లేట్లు లేని వాహనాల ద్వారానే వివిధ ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. నెలాఖరు కావడంతో వాటిని సిద్ధం చేసి స్థానిక హెచ్‌పి పెట్రోల్ బంకులో సిద్ధం చేసి ఉంచారు. ఈ నెంబర్ లేని వాహనాలు ఇతర ప్రాంతాల్లో అయితే సంబంధిత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు కేసులు నమోదు చేసే అవకాశం ఉండటంతో వీటిని ఎవరికి అనుమానం రాకుండా పెట్రోల్ బంకులో ఉంచినట్లుగా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ బియ్యం వ్యాపారం చేసే అక్రమార్కులకు ఎస్సార్ పేరుతో రెండు పెద్ద లారీలు, మరో నాలుగు నంబర్ ప్లేట్ లేని మినీ లారీలు ఉన్నాయి. రహదారిపై నడిచే వాహనాలకు సంబంధిత పత్రాలు లేకుంటే కేసులు నమోదు చేసి అపరాదు రుసుము వసూలు చేసే ఆర్టీఒ అధికారులకు ఎలాంటి నెంబరు ప్లేటు లేకుండా అక్రమంగా రవాణా చేసే వాహనాలు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం రేషన్ అక్రమ తరలింపుకు మాత్రమే వినియోగించే ఈ వాహనాలు రాత్రి వేళల్లో మాత్రమే బయట తిరుగుతుంటాయి. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులకు ఈ వాహనాలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం ఒక వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీటి వెనుక రాజకీయ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఏ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

➡️