కూరగాయల తోట

Jan 24,2024 10:21 #jeevana

రాయలాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణేష్‌ ఆరవ తరగతి చదువుతున్నాడు. చాలా చురుకైన విద్యార్థి. చదువుతో పాటు పాఠశాలకు సంబంధించిన తోట సంరక్షణ కూడా బాగా నిర్వహించేవాడు. చెట్లను అందంగా కత్తిరించడం, పూల మొక్కలకు పాదులు తవ్వడం, కొత్త మొక్కలు నాటడం, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులన్నీ తానే చూసుకునేవాడు. ఒకసారి గణేష్‌ స్కూలుకు వస్తుండగా రోడ్డు మీద ఓ కుళాయి దగ్గర నీళ్లన్నీ వథాగా పోతున్నాయి. కుళాయి పాడై ఆ నీళ్లు అలా ప్రవహిస్తున్నాయని గణేష్‌ గ్రహించాడు. ఆ నీళ్లు కాలువలా పాఠశాలను ఆనుకొని ప్రవహిస్తున్నాయి. అది చూసిన గణేష్‌కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన స్నేహితుల సహకారంతో ఆ కాలువ నీళ్లన్నీ పాఠశాల తోటలోకి పారేటట్లు చేశాడు. నీళ్లు నిరంతరం ప్రవహిస్తున్నాయి కాబట్టి పిల్లలందరూ ఓ నీటి గుంటను ఏర్పాటు చేశారు. నీళ్లు పుష్కలంగా ఉండడంతో తోటలో అదనంగా కొన్ని మడులను చదును చేసి రకరకాల కూరగాయల విత్తనాలు, ఆకు కూరల విత్తనాలను చల్లారు. వారం పది రోజుల్లో అవి చక్కగా మొలకెత్తాయి. గణేష్‌ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఉపాధ్యాయులు గణేష్‌ తెలివికి మెచ్చుకున్నారు. ఆ రోజు నుండి మధ్యాహ్న భోజన పథకానికి ఆ తోటలోని కూరగాయాలనే ఉపయోగిస్తున్నారని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తెలుసుకున్నారు. వయసులో చిన్నవాడైనా గణేష్‌ చేసిన మంచి పనిని మెచ్చుకుని, అందరికీ తెలిసేలా చేశారు. తల్లిదండ్రుల సమావేశం పెట్టి నీటి వృథాను అరికట్టి, మొక్కలను ఎలా సంరక్షించవచ్చో గణేష్‌తో చెప్పించారు. కార్యక్రమానికి వచ్చిన వారందరూ గణేష్‌ని ఎంతగానో అభినందించారు.

– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌,సిద్దిపేట, 94417 62105.

➡️