ఆ సీన్‌ విషయంలో అమ్మ ఎమోషనల్‌…

వర్షా బొల్లమ్మ.. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే యువ నటి. ఆమె మలయాళం, తమిళం, కన్నడతో పాటు తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడగలరు. ఈ మధ్య విడుదలైన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో ఆమె నటన చూసిన వారెవరైనా తెలుగు అమ్మాయే అనుకుంటారు. అవకాశాలు ఎన్ని వచ్చినా పాత్రల విషయంలో ఆచితూచి అడుగు వేస్తానంటున్న వర్ష గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వర్ష బొల్లమ్మ పొదిల్లి కోటేశ్వర్‌, శాంతి మొన్నమ్మ దంపతులకు కర్ణాటకలోని కూర్గ్‌లో జన్మించింది. పెరిగిందంతా బెంగళూరులో. మౌంట్‌ కార్మెల్‌ కాలేజ్‌ ఆటోనోమౌస్‌ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తిచేశారు. ఆమె తల్లి ఆమెను ఇంజినీరింగ్‌ చేయాలని కోరుకుంది. కానీ ఆమెకు మైక్రోబయాలజీలో ఆసక్తి ఉండడంతో అందులోనే పట్టభద్రురాలయ్యారు. ఐదేళ్ల వయసులో నుంచే నటిని అవుతానని చెప్పేవారట.
హైస్కూల్‌ స్థాయిలో ఉన్నప్పుడే సినిమాలపై ఆసక్తి ఉన్న వర్ష నటుల డైలాగ్స్‌ చెప్పిన డబ్‌స్మాష్‌ వీడియోలను సోషల్‌మీడియాలో పెడుతుండేవారు. ‘రాజా రాణి’ సినిమాలోని నటి నజ్రియా చెప్పిన డైలాగ్స్‌ని అనుకరిస్తూ డబ్స్‌మాష్‌ వీడియోను ఆమె ట్విట్టర్‌లో పెట్టారు. వర్షా కూడా నజ్రియా మాదిరిగా ఉండటంతో ఆ వీడియోను పెట్టిన కొద్దిరోజులకే బాగా గుర్తింపు వచ్చింది. 2015లో తొలి తమిళ చిత్రం ‘సతురన్‌’ నటించే అవకాశం వచ్చింది. వెంటనే ‘ఇవాన్‌’ ‘యారెండ్రు తేరికిరాత’ యనుం తీయవన్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మలయాళంలో రంగ ప్రవేశం చేశారు. ‘కల్యాణం’, ‘శారీ’ లో నటించారు. తమిళంలో ’96’ ‘సీమతురై’, పెట్టికడై తంగం, ‘సూత్రక్కారన్‌’లో వరసగా నటించారు. తమిళంలో ‘బిగిల్‌’లో విజరుతో నటించే అవకాశమూ వచ్చింది. ‘చిన్నప్పటి నుంచి విరాట్‌ కోహ్లీ అభిమానిని. స్కూల్లో చదువుతున్న రోజుల్లో పేపర్‌లో కోహ్లీ ఫొటో కనబడితే చాలు.. వెంటనే దాన్ని కత్తిరించి, నా పుస్తకాల్లో భద్రంగా దాచుకునేదాన్ని. ఈ సినిమాలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా నటించేటప్పుడు పట్టుబట్టి మరీ పద్దెనిమిదో నంబర్‌ జెర్సీ తీసుకున్నా. ఎందుకంటే కోహ్లీ జెర్సీ నంబర్‌ 18 కాబట్టి’ అని తన అభిమానాన్ని చాటుకున్నారు వర్షా.
ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చాయి. ‘చూసీ చూడంగానే’ సినిమాలో డ్రమ్మర్‌ అండ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నటించారు. ఆ తర్వాత ‘జాను’లో, దేవరకొండ ఆనంద్‌తో కలిసి ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’లో నటించారు. ఈ సినిమాలోని ఆమె సహజ నటనకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. నానితో కలిసి ‘సుందరానికి తొందరెక్కువ’లోనూ నటించారు.


‘మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ నటిని కావాలనుకున్నప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్‌ చేశారు. నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. వచ్చిన పాత్రల్లో కొత్తదనం ఉంది అనుకుంటేనే నటించేందుకు ఒకే చెబుతాను. నాతో పాటు అమ్మ కూడా షూటింగులకు వస్తుంటుంది. ఏదైనా పెళ్లి సీన్‌లో నటించాల్సి వస్తే చాలు.. అమ్మ ఏడ్చేస్తుంది. ”అమ్మా.. ఇది కేవలం షుటింగ్‌ మాత్రమే. నేనేమీ నిజంగా పెళ్లి చేసుకోవట్లేదు” అని ఓదారుస్తూ ఉంటాను. అయినా తను ఎమోషనల్‌ అవుతూనే ఉంటుంది’ అని తన తల్లిప్రేమ గురించి చెప్పారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘స్వాతిముత్యం’ చిత్రంలో గణేష్‌తో కలిసి వర్షా నటించారు. ఈ చిత్రం తర్వాత వర్షా, గణేష్‌తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని మీడియాలో ప్రచారం జరిగింది. అయినా ఆమె స్పందించలేదు. ఈ మధ్య ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా.. ‘ఆ సినిమా తర్వాత గణేష్‌తో పెద్దగా మాట్లాడలేదు. కనీసం బయట ఎక్కడా తిరగలేదు. అలా ఎలా గణేష్‌తో ప్రేమ, పెళ్లి అని మీడియాలో చెబుతారు?’ అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. నటనపరంగా సీనియర్‌ నటి రేవతిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని, కేరియర్‌లో ముందుకు వెళుతున్న వర్షా టాలీవుడ్‌ నటుల్లో విజరు దేవరకొండ అభిమాని. ఇంకా టాలీవుడ్‌లో జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ యాక్టింగ్‌, డ్యాన్స్‌ అంటే ఇష్టమన్నారు.

పేరు : వర్ష, గాయత్రి
పుట్టిన తేది :1995, జులై 30
వృత్తి : నటి

➡️