కుల దృవీకరణ పత్రాలపై సిఎం ఫోటో వద్దు : వర్ల రామయ్య

varla ramaiah comments on cm photo on caste certificate

ప్రజాశక్తి-మంగళగిరి : కుల దృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించడంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు లేఖ రాశారు.  రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్న కులదృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బొమ్మ ముద్రిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కుల దృవీకరణ పత్రాలపై సిఎం బొమ్మ ముద్రించడం ఎన్నికల సంఘం తలపెట్టిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండికొట్టడమేనని తెలిపారు. కుల దృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించి జగన్ రెడ్డికి రాజకీయ లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాధనంతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరమని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా వచ్చే ఈ తరుణంలో రెవెన్యూ అధికారుల ఇలాంటి చర్యలు తగవని తెలిపారు.  రెవెన్యూ అధికారులు కులదృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించడం అధికార పార్టీని బలపరచడమేనని ద్వజమెత్తారు. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని ఎన్నికల నియమావళి చాలా స్పష్టంగా చెబుతోందన్నారు.  కావున, కుల దృవీకరణ పత్రాలపై, భూమి ప్రతాలైన పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోవు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు తగు చర్యలు తీసుకోవాలని , అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

➡️