కమ్యూనిస్టులతోనే ప్రజల హక్కులకు రక్షణ

  • అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ : వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : కమ్యూనిస్టులతోనే ప్రజల హక్కులకు రక్షణ ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో సిపిఎం పోటీ చేయనుందని, ప్రజలు గెలిపించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వి.శ్రీనివాసరావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఏజెన్సీలో దోపిడీని ప్రతిఘటించడంలో సిపిఎం, ఎర్రజెండా చేసిన త్యాగాలు, పోరాటాలు కీలకమని తెలిపారు. పాలకులు ఏజెన్సీలో దాడులు చేసి వందల, వేల ఎకరాలను బడాబాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి భూములు కాజేయడానికి హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను తెస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని గిరిజనుల హక్కులను కాలరాసి అదానీ వంటి కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. 370 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం మార్పు జరిగితే గిరిజన చట్టాలను ఎత్తేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో క్రిస్టియన్‌, హిందువుల మధ్య మత చిచ్చు పెట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక రూపొందించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్లాన్‌కు లొంగిపోయి టిడిపి, జనసేనలు మద్దతిస్తున్నాయన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ప్రారంభించి పదేళ్లు గడుస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. పదేళ్లుగా యూనివర్సిటీ కట్టడం చేతకాని వారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యాంకులకు రూ.350 కోట్లు ఎగ్గొట్టిన కొత్తపల్లి గీత బిజెపి తరుపున అరకు ఎంపి అభ్యర్థిగా వస్తున్నారని, బ్యాంకు సొమ్ము, దోపిడీ చేసిన వ్యక్తిని ఆదివాసీలు గెలిపించాలా? అని నిలదీశారు. అరకు వైసిపి ఎంపి మాధవి కూడా ఏనాడూ పార్లమెంట్‌లో గిరిజన హక్కులపై మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. జిఒ నెంబర్‌ 3 రద్దు విషయంలోనూ ఆమె నోరు మెదపలేదని తెలిపారు. అభివృద్ధిలోనూ, గిరిజనుల హక్కులను కాపాడడంలోనూ వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఆదివాసీ ప్రాంతం అశాంతికి బిజెపి, వైసిపిలే కారణమవుతాయని తెలిపారు. దేశంలో సిఎఎ వస్తే ముస్లిములకే కాకుండా ఆదివాసులకు కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎఎ విషయంలో వైసిపి, టిడిపి, జనసేన ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కేరళ, తమిళనాడుల్లో తమ వైఖరులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి అంటే మోడీకి భజన చేస్తూ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు జైలుకు వెళ్లకుండా ఉండడమా అని అన్నారు. వామపక్షాల ప్రతినిధులు అసెంబ్లీ, పార్లమెంట్‌ల్లో ఉంటే అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనంతగిరి జెడ్‌పిటిసి డి.గంగరాజు పాల్గొన్నారు.

➡️