యుసిసి బిల్లుకు ఉత్తరాఖండ్‌ ఆమోదం

Feb 8,2024 09:41 #UCC, #Uttarakhand
uttarakhand govt passed UCC bill

డెహ్రాడూన్‌ / జైపూర్‌ : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే బుధవారం ముందుగా ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటికి పంపాలని ప్రతిపక్షాలు పంపాలని డిమాండ్‌ చేశాయి. బిల్లు ఆమోదానికి ముందు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష సభ్యులు కోరారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను పెడ చెవిన పెట్టిన బిజెపి సంఖ్యాబలం చూసుకొని ఏకపక్షంగా ఆమోదింపజేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి మాట్లాడుతూ 2022 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు.

  • రాజస్థాన్‌లోనూ యుసిసి : మంత్రి కన్హయ్య

ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదించిన నేపథ్యంలో రాజస్థాన్‌ మంత్రి కన్హయ్య లాల్‌ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోనూ యుసిసిని త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. తదుపరి శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌ తర్వాత యుసిసి తీసుకొచ్చిన రెండో రాష్ట్రంగా రాజస్థాన్‌ ఉంటుందని, ముఖ్యమంత్రి దీనికి అనుకూలంగా ఉన్నారని కన్హయ్య వ్యాఖ్యానించారు. త్వరలోనే యుసిసిపై కార్యాచరణ మొదలు పెడతామని ఆయన తెలిపారు. కాబట్టి వచ్చే అసెంబ్లీ సెషల్‌ లేదా తదుపరి సెషన్‌లో ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకొస్తామని పేర్కొన్నారు. మరోవైపు యుసిసి బిల్లును సరైన సమయంలో ప్రవేశపెడతామని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తెలిపారు.

➡️