మారిన వాతావరణంతో హార్వెస్టర్ల వినియోగం

Nov 24,2023 00:33

ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు)
ఓ ప్రక్క వాతావరణం మారింది. మరోపక్క పరిపక్వానికి చేరుకున్న పంటను చేతికి దక్కించుకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. ఈ కోణంలో రైతులు హడావుడిగా హార్వెస్టర్లను వినియోగిస్తున్నారు. వేమూరు, కొల్లూరు, అమర్తలూరు మండలాల్లో ముందుగా సాగు చేసిన వరి పంట కోతకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం వరి ధాన్యం ధర రూ.1600వరకు పలుకుతుందని రైతులు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం 75కేజీల బస్తా రూ.1800లకు కొనుగోలు చేయగా ఈ రెండు రోజులకే వ్యాపారులు రూ.200 ధర తగ్గించారని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడంతో దళారులు ధరను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పంట చేతికి అందితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని, దీనిపై చర్య లేవీ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా మే నెల వరకు రైతులు చేతుల నుండి ధాన్యం పూర్తిగా బయటకు వెళ్లేంతవరకు 75కేజీల బస్తా ధాన్యం ధర రూ.1500లకు మించలేదని, రైతుల నుండి ధాన్యం పూర్తిగా వ్యాపారస్తుల చేతులకి వెళ్ళిన తర్వాత అదే ధాన్యం 75కేజీలు రూ.2500వరకు వెళ్లినట్లు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త ధాన్యం చేతికందే సమయానికి పాతదాన్యం కూడా 75కేజీల బస్తా రూ.2200కు తగ్గిందని, దానికి అనుగుణంగా కొత్త ధాన్యం ప్రస్తుతం రూ.1600కే కొనుగోలు చేయటం పట్ల పెరిగిన ఖర్చులతో తీవ్ర నష్టాలను చదివి చూడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో దళారులదే రాజ్యంగా కనిపిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.
వర్షాలకు నేల వాలుతున్న వరి పైరు
ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల్లో కురుస్తున్న చిరుజల్లులకు వరిపైరు నేలవాల్సింది. చేతికి అందిన పంటను దక్కించుకోవడానికి ఏర్పాటు చేసే హార్వెస్టర్లకు కూడా అధిక ధరలు వెచ్చించాల్సి ఉంటుంది. దానికి తోడు ధాన్యం ధర కూడా తగ్గుముఖం పట్టడంతో రైతుల పరిస్థితి ఆగమ్యకుచరంగా మారింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని రైతుల కోరుతున్నారు.

➡️