యురేనియం పరిశ్రమ పైప్‌లైన్‌ లీకేజీ

Feb 17,2024 08:55 #Kadapa, #pipeline leakage
Uranium Industry Pipeline Leakage

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ (వైఎస్‌ఆర్‌ జిల్లా) : పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం తుమ్మలపల్లి ఉన్న యురేనియం కర్మాగారం వ్యర్థ పదార్థాల పైపులైన్‌ లీకేజీ కావడంతో వ్యర్థ పదార్థాలు పొలాలు, బహిరంగ ప్రదేశాలలోకి రావడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యర్థపదార్థాల విషయంలో యుసిఐఎల్‌ నిర్లక్ష్యం వహిస్తూనే ఉందని మరోసారి నిరూపితమైంది. వ్యర్థపదార్థాలు బహిరంగ ప్రదేశాలలోకి రావడంతో నీరు భూమిలోకి ఇంకి నీరు కలుషితం కావడం వల్ల అనారోగ్యాలు కలుగుతున్నాయని, పంటలకు వైరస్‌ సోకే ప్రమాదముందని రైతులు యురేనియం అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా, వ్యర్థ పదార్థాల విషయంలో పరిష్కారం చూపలేకపోతున్నారు. పదేపదే పైప్‌లైన్‌ లీకేజీలు కావడం పరిపాటిగా మారుతోంది. శుక్రవారం యుసిఐఎల్‌ నుంచి టైలింగ్‌ ఫాండ్‌కు వ్యర్థాలను తరలించే పైప్‌ లైన్‌ లీకేజీ అవడంతో వ్యర్థాలు పొలాల్లోకి ప్రవహించాయి. గమనించిన కొందరు రైతులు యుసిఐఎల్‌ అధికారులుకు తెలిపారు. అధికారులు పైప్‌లను మరమ్మతులు చేసి లీకేజీ అయిన యురేనియం వ్యర్థాలు బయటకు కనిపించకుండా కన్జర్వేటర్‌ సాయంతో ఆ ప్రదేశాన్ని క్లీన్‌ చేయించారు. టైలింగ్‌ పాండ్‌ పరిహారాన్ని యుసిఐఎల్‌ గాలికి వదిలేసిందనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. పంటలు, పశుసంపద పూర్తిగా నాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వ్యర్థ పదార్థాలు లీకేజీ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

➡️