ఎపికి ‘ఉపాధి’కి బకాయిలు రూ.122 కోట్లు

Dec 14,2023 09:03 #Central Minister, #MGNREGS
upadi hami pathakam sadhvi niranjan jyoti

కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతన కాంపోనెంట్‌ కింద ఈ ఏడాది డిసెంబర్‌1 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలు రూ. 122.75 కోట్లు మాత్రమే ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి రూ.1,019 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె వివరించారు. ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు విడుదల చేయడమన్నది నిరంతర ప్రక్రియ. క్షేత్రస్థాయిలో పని డిమాండ్‌ను బట్టి వాటికి నిధులు సమకూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు రూ.60వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనంగా మరో రూ.10వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అయితే గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నిధులు ఆశిస్తుందని మంత్రి వెల్లడించారు.

➡️