మూకదాడుల వర్సిటీలు!

విజ్ఞాన వెలుగులు విరజిమ్ముతూ.. అజ్ఞానాంధకారాన్ని పారదోలాల్సిన విశ్వ విద్యాలయాల్లో మూకదాడులు చోటుచేసుకోవడం దారుణం. ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలకు భయపడుతూ చదువుకోవాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలన్నీ స్వేచ్ఛను ప్రోత్సహిస్తాయి. వంద భావాలు సంఘర్షించనీ.. వెయ్యి భావాలు వికసించనీ.. అన్న విధంగా పనిచేస్తాయి. భారతీయుల నరనరాల్లో తరతరాలుగా జీర్ణించుకుపోయిన భిన్నత్వంలో ఏకత్వం అన్న సంప్రదాయం తుదముట్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏలుబడిలో వ్యవస్థీకృతంగా యత్నాలు జరుగుతున్నాయి. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ విశ్వవిద్యాలయంలో తమకు కేటాయించిన గదిలో రంజాన్‌ సందర్భంగా నమాజ్‌ చేసినందుకు ఐదుగురు విదేశీ విద్యార్థులపై ఓ మూక విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ దృశ్యాల వీడియోలు వైరల్‌ కావడంతో విదేశాల్లో సైతం విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో సర్కారుకు స్పందించక తప్పలేదు. నేరపూరితంగా వ్యవహరించారని, క్యాంపస్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. మరోవైపు వర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ నీర్జాగుప్తా దాడికి గురైన శ్రీలంక, తుర్క్‌మెనిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఆఫ్రికన్‌ దేశాల విద్యార్థులను వేరొక హాస్టల్‌కు తరలిస్తామంటూనే… విదేశీ విద్యార్థులు రాష్ట్రంలోని విజిటేరియన్‌ సొసైటీ మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆహారపు అలవాట్లు, ప్రవర్తన మార్చుకోవాలి. స్థానిక సమాజం, ఆచారాలు, భావోద్వేగాల గురించి వారికి తెలియజేయాలి… తద్వారా వారు సురక్షితంగా ఉంటారు…’ అంటూ సుద్ధులు చెప్పడం తీవ్ర అభ్యంతరకరం.
మరింత శాంతియుతంగా, సహనశీలంగా, సమ్మిళితంగా, సురక్షితంగా ఉంటూ.. స్థిరమైన సమాజాల అభివృద్ధిని ప్రోత్సహించేలా ఉండాలని బిజెపి సర్కారే తీసుకొచ్చిన 2020 జాతీయ విద్యావిధానం నొక్కిచెబుతోంది. దీనికి విరుద్ధంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు గూండాల్లాగా వర్సిటీలలో శివమెత్తుతున్నారు. గుజరాత్‌లోని వర్సిటీలు ఎంత ఘోరంగా అఘోరించాయో గుజరాత్‌ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జిఎన్‌ఎల్‌యు) ఘటనలే తేల్చిచెబుతున్నాయి. వేధింపులు, అత్యాచారాలు, స్వలింగ సంపర్కం, వివక్ష వంటి సమస్త రుగ్మతలకు వర్సిటీ ఆలవాలంగా ఉందని ఇటీవల గుజరాత్‌ హైకోర్టు నిజనిర్ధారణ కమిటీ తేల్చిచెప్పింది. ఇక్కడి విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందని, మరో విద్యార్థిని వేధింపులకు గురైందని సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలపై హైకోర్టు సుమోటాగా స్పందించడంతోనే ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. విద్యార్థుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి, సోషల్‌ మీడియాలో పోస్టులు ప్రతిష్టకు భంగకరంగా వర్సిటీ భావించిందంటేనే ఆ రాష్ట్రంలో దుర్మార్గ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
దేశ నడిబొడ్డున ప్రగతిశీల భావాలకు ఆలవాలంగా ఉంటూ ఎందరో మేధావులను తీర్చిదిద్దిన జవహర్లాల్‌ నెహ్రూ వర్సిటీలో ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలు పైశాచిక దాడి చేసి నాలుగేళ్లు దాటినా నేటికీ చర్యలు లేవు. 2023లో 80 శాతం ముస్లిం వ్యతిరేక విద్వేష పూరిత ప్రసంగాలు, ఘటనలు బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి. పండగల సమయంలో.. ముస్లిములపై హింసను ప్రోత్సహించే పాటలు ప్లే చేస్తూ, ఆయుధాలతో కవాతు చేస్తూ ఇతర మతాల ప్రార్థనా మందిరాల వద్ద వీరంగాలు పెరిగిపోయాయి. ఇటీవల కాలంలో సినిమాలుసైతం సోషల్‌ మీడియాకు తోడుగా ఇందులో భాగం పంచుకుంటున్నాయి. ఇటువంటి వాటికి కేరళలో వామపక్ష సర్కారు అడ్డుకట్ట వేస్తుండటంతో… అక్కడి వర్సిటీలపై గవర్నర్‌ దాడి నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా…. మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును… అన్న గురజాడ స్ఫూర్తితో సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనశీలత లాంటి భారతీయ వారసత్వాన్ని పెంపొందించుకుంటూ.. వర్సిటీలు ఆదర్శవంతంగా నిలవాలి. అందుకు ఆటంకంగా ఉన్న కార్పొరేట్‌ – మతతత్వ కూటమి పాలన అంతం కావాలి.

➡️