విజ్ఞాన కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు

– పద్మావతి మహిళా వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌

ప్రజాశక్తి – క్యాంపస్‌ (తిరుపతి) :విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పద్మావతి యూనివర్సిటీ ఛాన్సలర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. విద్యావంతులైన మహిళలను సమాజానికి అందిస్తున్న విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులు దేశసేవలో భాగస్వాములు కావాలని కోరారు. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కళాక్షేత్రంలో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ 21వ స్నాతకోత్సవం వేడుక గురువారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఇస్రో శాస్త్రవేత్త మంగళమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీలకు గౌరవ పురస్కారాన్ని అందజేశారు. గవర్నర్‌ ప్రసంగిస్తూ.. పద్మావతి విశ్వవిద్యాలయం ద్వారా నాలుగు దశాబ్దాలుగా మహిళలు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించి, సమాజానికి దోహదపడుతున్నారని అన్నారు. లింగ సమానత్వం అనేది స్థిరమైన అభివృద్ధిలో ముడిపడి ఉందన్నారు. మంగళ మణి మాట్లాడుతూ.. తాను ఇస్రో శాస్త్రవేత్తగా చారిత్రాత్మకమైన అంటార్కిటిక్‌ ఎక్స్పెడిషన్‌ కొరకు 400 రోజులు చేసిన ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నానని చెప్పారు. వైస్‌ ఛాన్సలర్‌ డి.భారతి మాట్లాడుతూ.. పద్మావతి మహిళా వర్సిటీకి న్యాక్‌ ఎ గ్రేడ్‌ లభించిందన్నారు. డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ ఇన్‌ సైన్సెస్‌లో అర్హత సాధించిన 34 మందికి, సోషల్‌ సైన్సెస్‌, హ్యూమనిటీస్‌, మేనేజ్‌మెంట్‌ పిహెచ్‌డి చేసిన 29 మందికి గవర్నర్‌ చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ నందు విశేష ప్రతిభ కనబరచిన 36 మంది విద్యార్థినులకు, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, హ్యుమనిటీస్‌, మేనేజ్‌మెంట్‌ నందు ప్రతిభ కనబరచిన 21 మంది విద్యార్థినులకు గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ లక్ష్మీషా, ఎస్‌పి కఅష్ణ కాంత్‌ పటేల్‌, ఆర్‌డిఒ నిశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️