ముస్లిం రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం – కేంద్ర మంత్రి, బిజెపి నేత పియూష్‌ గోయల్‌

– చంద్రబాబుతో గంటపాటు చర్చలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రకటించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం విజయవాడ చేరుకున్న మంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ఉండవల్లి నివాసంలో గంటకుపైగా చర్చించారు. ప్రస్తుతం ఎన్నికల తీరు, ప్రచారం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మోడీ పర్యటనకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. అనంతరం విజయవాడలోని ఓ హోటల్లో గోయల్‌ మీడియాతో మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లను తాము వ్యతిరేకిస్తున్నామని, మార్పులు చేర్పులు చేసేందుకు ఇదే తమకు తగిన సమయమని ప్రకటించారు. రాష్ట్రంలో ఐదేళ్ల వైసిపి పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, ఎపి వెనుకబడిందని, రైతులను పట్టించుకోవడం మానేశారని తెలిపారు. ఇసుక, ల్యాండ్‌, లిక్కర్‌ మాఫియాలకు కేంద్రంగా ఎపి మారిందని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వలేదని పేర్కొన్నారు. జిడిపిలో దేశం ఐదోస్థానానికి చేరుకుందని, మోడీ ఇచ్చిన హామీలను మర్చిపోలేదని, రామమందిర నిర్మాణం భారతీయులందరికీ గర్వకారణమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి గెలుపు ఖాయంగా కనిపిస్తోందన్నారు.
టిడిపి ఏం చెబుతుంది?
పియూష్‌ గోయల్‌ ప్రకటనతో టిడిపి గొంతులో వెలక్కాయపడింది. టిడిపి ముస్లిం రిజర్వేషన్ల విషయమై తమ వైఖరి ఏమిటన్నది ప్రజలకు స్పష్టపర్చవలసిన అవసరం ఏర్పడింది. ఒకే కూటమిలో వున్నా పార్టీలు పూర్తి విరుద్ధ వైఖరులు తీసుకుంటాయని చెబుతారా? లేక బిజెపి విధానమే తమదీ అని చెబుతారో చూడాలి. రాష్ట్రంలో మైనార్టీలు గణనీయమైన నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే విధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన బిజెపి నేత ప్రకటన ఎన్‌డిఎ కూటమిలో ప్రధానంగా ఉన్న టిడిపికి మింగుడు పడని అంశంగా మారింది.

➡️