ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

Jan 12,2024 08:56 #1, #Budget, #February
  • 31 నుండి పార్లమెంటు సమావేశాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరిసారిగా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 31న బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. మధ్యంతర బడ్జెట్‌లో మహిళా రైతులకు ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇచ్చే నగదు సాయాన్ని రెట్టింపు చేస్తారని భావిస్తున్నారు. ఇక ఏప్రిల్‌, మేలో లోక్‌సభ ఎన్నికలు రానుండటంతో బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రం ఏమైనా కీలక ప్రకటనలు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున పూర్తి బడ్జెట్‌గా కాకుండా మధ్యంతర బడ్జెట్‌గా ఉంటుంది. ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో లేదా పూర్తి బడ్జెట్‌కు తగినంత సమయం లేనప్పుడు మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తుంది. ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వం పూర్తి వార్షిక బడ్జెట్‌ను రూపొందించే బాధ్యతను తీసుకుంటుంది. సమగ్ర ఆర్థిక సర్వేకు బదులుగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌కు ముందు 2024-25 సంవత్సరానికి సంబంధించి దేశ ఆర్థిక స్థితిపై సంక్షిప్త పత్రాన్ని సమర్పించాలని భావిస్తున్నారు.

➡️