Hate Speech: విద్వేష జాడ్యం

  • ఎన్నికల వేళ బరితెగిస్తున్న బిజెపి నేతలు

న్యూఢిల్లీ : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బిజెపి విద్వేష, విచ్ఛిన్నకర రాజకీయాలను ముమ్మరం చేస్తోంది. ప్రధాన మంత్రి దగ్గర నుండి గల్లీ నాయకుడి దాకా ఇదే పనిలో ఉన్నారు. మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, భాష పేరుతోనో విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చీలికలు సృష్టించేందుకు బాహాటంగానే యత్నిస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి శోభా కరండ్లాజే కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. మరో వైపు అస్సాంలో ఇవే శక్తులు ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీల్లో మత విద్వేషాగ్నిని రాజేసేందుకు యత్నించాయి.
ప్రధాని మోడీ దగ్గర శిష్యరికం పొందిన కేంద్ర సహాయ మంత్రి శోభా కరండ్లాజె ఇటీవల బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు ప్రశాంతంగా ఉన్న తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చు పెట్టేవిగా ఉన్నాయి. ఇటీవల ఓ నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు తమిళనాడు ప్రజలే కారణమని ఆరోపించారు. తమిళనాడులో శిక్షణ పొంది ఇక్కడ బాంబులు వేస్తారు అని ఆరోపించారు. ఈ పేలుడు కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో సాక్షాత్త్తూ కేంద్ర మంత్రి ఒకరు ఈ విధమైన చౌకబారు వ్యాఖ్యలు చేయడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు. బిజెపి నాయకుల విద్వేష రాజకీయాలకు ఇదో మచ్చుతునక అని విమర్శించారు. కేంద్రమంత్రి విద్వేషపూరిత వ్యాఖ్యలను తమిళులు, కన్నడిగులు తిరస్కరిస్తారని డిఎంకె పేర్కొంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన కరండ్లాజెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిఎంకె డిమాండ్‌ చేసింది. మదురై సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేంద్ర మంత్రిపై కేసు కూడా నమోదయింది. ‘భాషా ప్రాతి పదికన రెండు ప్రాంతాల ప్రజల మధ్య శుత్రుత్వాన్ని పెంచుతున్నారు’ అని మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు అభియోగం మోపారు. కడచానెంతల్‌కు చెందిన సి.త్యాగరాజన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంత్రిపై ఈ కేసు నమోదు చేశారు. ఐపిసిలో 153, 153ఎ, 505(1), 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదయింది..
ముస్లింలను క్రిమినల్స్‌గా చిత్రించిన అస్సాం యూనివర్శిటీ
బిజెపి పాలనలో ఉన్న అస్సాంలోని ఒక యూనివర్శిటీ ముస్లింలను క్రిమినల్స్‌గా చిత్రించారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని బోడోలాండ్‌ యూనివర్శిటీలో ఈ నెల 16న ఒక సాంస్కృతిక కార్యాక్రమం నిర్వహించారు. యూనివర్శిటీ 23వ వారోత్సవాల సందర్భంగా యూనివర్శిటీ భౌగోళిక విభాగం ‘మనం, మన సమాజం’ పేరుతో ఒక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించింది. ఇందులో ఇద్దరు క్రిమినల్స్‌ పాత్రదారులకు ముస్లిం మతస్థుల వేషధారణ వేశారు. వీరిని ఒక పోలీసు కొడుతూ ఉన్న దృశ్యాన్ని ప్రదర్శించారు. ముస్లింలను అభ్యంతరకరంగా చిత్రీకరించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అల్‌ బోడోలాండ్‌ టెరిటోరియల్‌ రీజన్‌ మైనార్టీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎబిటిఆర్‌ ఎంఎస్‌యు) ప్రతినిధులు, అల్‌ అస్సాం మైనార్టీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎఎఎంఎస్‌) ప్రతినిధులు యూనివర్శిటీ వైఎస్‌ ఛాన్సలర్‌ బాబులాల్‌ అహుజాను కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైస్‌ ఛాన్సలర్‌ వారికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం ఉన్న అస్సాంలో ముస్లిం అణచివేత చర్యలు తీవ్రంగా సాగుతున్న సంగతి తెలిసిందే.

➡️