కేంద్ర బడ్జెట్‌ ఎవరికి మేలు చేస్తుంది?

union budget 2024 bjp govt economy failures article

పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికలకు దేశం, రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను సమర్పించాలి. మోడీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్‌ ప్రాసంగికత బాగా తగ్గిపోయింది. ప్రభుత్వ ప్రకటనలు చాలా వరకు బడ్జెట్‌కు వెలుపలే జరిగిపోతున్నాయి. ప్రభుత్వం పార్లమెంటును చాలా వరకు విస్మరిస్తోంది. ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ తాజాగా విడుదల చేసిన ‘ఇండియన్‌ ఎకానమీ-యాన్‌ ఓవర్‌ వ్యూ’ నివేదిక దీనికి ఉదాహరణ. ఎప్పటిలాగే బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి. ఈ సంప్రదాయానికి బ్రేక్‌ వేస్తూ రెండు రోజుల క్రితం పార్లమెంట్‌ వెలుపల ఆర్థిక సర్వే తరహాలో ఓ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు విడుదల చేశారు.

రాబోయే సంవత్సరాల్లో భారత దేశం ఏడు శాతానికి పైగా ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని, మూడేళ్లలో ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఐదు ట్రిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరం మొత్తం ఆర్థిక వృద్ధి మార్కెట్‌ ధరల ప్రకారం (ద్రవ్యోల్బణానికి అనుగుణంగా) 10.5 శాతంగా ఉంటుందని గత బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి అంచనా వేశారు. ఇప్పటికే విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే ప్రస్తుత ఏడాది వృద్ధి తొమ్మిది శాతం లోపే ఉండనుంది. ఇది మోడీ ప్రభుత్వ ప్రకటనలలోని డొల్లతనాన్ని బయట పెడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని ఇటీవల బిజెపి నేతలు, మంత్రులు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసిన సంగతి కూడా గుర్తుంచుకోవాలి.

గత ఐదేళ్లలో మొత్తం దేశీయ ఆదాయంలో 18 శాతం వృద్ధిని ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. దీనివల్ల ఎవరికి లబ్ధి చేకూరిందనేది పరిశీలించాలి. ఆర్థిక వ్యవస్థ చలనశీలతపై అధికారిక పరిశోధనలు చేసే ప్రైవేట్‌ ఏజెన్సీ ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ (సిఎమ్‌ఐఇ) ప్రకారం, దేశంలో ఐదు సంవత్సరాలలో ఉపాధి వృద్ధి శూన్యం. దీనికి కోవిడ్‌ మహమ్మారిని మాత్రమే నిందించలేం. 2019కి ముందు ఉపాధి పరిస్థితి దారుణంగా ఉండేది. యుపిఎ హయాంతో పోల్చితే మోడీ ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని రెట్టింపు చేసిందని చెబుతుండగా, ఉపాధి వృద్ధి సగానికి పడిపోయింది. 100 మంది కార్మికులు చేసిన పనిని కొత్త టెక్నాలజీలను ఉపయోగించి 50 మంది చేస్తున్నారు. ప్రభుత్వం లాభాపేక్షతో పెట్టుబడిదారీ దోపిడీకి పాల్పడుతోంది. ప్రైవేటీకరించడం, కార్మిక చట్టాలను సరళీకరించడాన్ని ప్రభుత్వం లాభాలుగా చెప్పుకుంటున్నది. కానీ నిరుద్యోగం పెరుగుతు న్న దేశంలో మార్కెట్‌ మందకొడిగా ఉంది. దేశంలో విలాసవంతమైన కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్ల విక్రయాలు పడిపోతున్నాయి. విలాసవంతమైన వస్తువులు ఎక్కువగా అమ్ముడవుతుండగా, మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఉపయోగించే ఉత్పత్తులకు మార్కెట్‌ తగ్గిపోతోంది. వృద్ధిలో ధనవంతులు మాత్రమే లబ్ధిదారులు. ఈ నేపథ్యంలోనే జిడిపి లో మూడు శాతం ఖర్చు చేసినా 4 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగిత రేటు 10 శాతంగా పరిగణిస్తే వెంటనే 4 కోట్ల మందికి ఉపాధి కల్పించాలి. ప్రస్తుత ఏడాది జిడిపి ని పరిశీలించినట్లయితే దీని కోసం 9.6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుంది. కార్పొరేట్లకు పన్ను మినహాయింపులు ఇవ్వడానికి, బ్యాంకుల్లో మొండి బకాయిలను మాఫీ చేసేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రభుత్వం నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

బడ్జెట్‌కు ముందు, ప్రధాన స్రవంతి మీడియా చర్చల నిండా కార్పొరేట్ల ఆందోళనలు, అంచనాలే. 2022-23 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2017లో కేంద్రం ప్రకటించింది. ఈ ప్రకటన ప్రభావంపై గణాంకాలు విడుదల చేయలేదు. రైతుల అనుభవంలో ఆదాయానికి గండి పడుతోందని రైతు సంఘాలు ఎత్తి చూపుతున్నాయి. విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం వంటి ర్గంగాల నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటున్నది. పెట్రోలియం ఉత్పత్తులపై ప్రత్యేక సుంకం పెంపుదల కేంద్రానికి ఆదాయం పెరగడానికి దారితీసింది, అయితే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంది. రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న ప్రతికూల వైఖరిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి ఆదాయం పెరుగుతోంది. 2022-23లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.19.72 లక్షల కోట్లు వచ్చాయని కేంద్రం పేర్కొంది. 7.78 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మినహాయింపులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది.

  • సజన్‌ ఎవ్జిన్‌ (‘దేశాభిమాని’ సౌజన్యంతో)
➡️