యూనియన్‌ బ్యాంక్‌ ఫలితాలు ఆదుర్స్‌

Jan 20,2024 21:10 #Business

క్యూ3 లాభాల్లో 60% వృద్థి

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో మొండి బాకీలకు కేటాయింపులు తగ్గడం, వడ్డీ ఆదాయంలో పెరుగుదలతో 60 శాతం వృద్థితో రూ.3,590 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,249 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.24,154 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ మొత్తం ఆదాయం.. క్రితం క్యూ3లో రూ.24,154కు చేరింది. బ్యాంక్‌ వడ్డీ ఆదాయం ఏకంగా రూ.25,363 కోట్లకు చేరింది. 2022-23 ఇదే క్యూ3లో రూ.20,883 కోట్ల వడ్డీ ఆదాయం చోటు చేసుకుంది. 2023 డిసెంబర్‌ 31 నాటికి యూనియన్‌ బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) 4.83 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలానికి 7.93 శాతానికి జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. ఇదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు 2.14 శాతంగా ఉండగా.. 2023 డిసెంబర్‌ ముగింపు నాటికి 1.08 శాతంగా చోటు చేసుకున్నాయి.

భారీగా తగ్గిన ఐడిబిఐ బ్యాంక్‌ ఎన్‌పిఎలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఐడిబిఐ బ్యాంక్‌ 57.3 శాతం వృద్థితో రూ.1,458 కోట్ల నికర లాభాలు సాధించింది. కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసి కీలక వాటాలు కలిగిన ఈ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 17.4 శాతం పెరిగి రూ.3,434.60 కోట్లకు చేరింది. 2023 డిసెంబర్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు ఏకంగా 4.69 శాతానికి దిగివచ్చాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఏకంగా 13.82 శాతం జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోని 4.90 శాతం స్థూల ఎన్‌పిఎలతో పోల్చితే.. గడిచిన క్యూ3లో తగ్గుదల చోటు చేసుకుంది. నికర నిరర్థక ఆస్తులు 1.08 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభాలు 60 శాతం పెరిగి రూ.4,006 కోట్లుగా, నికర వడ్డీ ఆదాయం 29 శాతం వృద్థితో రూ.10,499 కోట్లుగా నమోదయ్యింది.

కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3,005 కోట్ల లాభాలు

కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 7.63 శాతం వృద్థితో రూ.3,005.01 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. 2022 ఇదే త్రైమాసికంలో రూ.2,791.88 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో సంస్థ నికర వడ్డీ ఆదాయం రూ.5,653 కోట్లుగా ఉండగా.. గడిచిన త్రైమాసికంలో 16 శాతం వృద్థితో రూ.6,554 కోట్లకు చేరాయి. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 1.90 శాతం నుంచి 1.73 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 0.43 శాతం నుంచి 0.34 శాతానికి పరిమితమయ్యాయి.

అంచనాలు చేరిన ఐసిఐసిఐ బ్యాంక్‌

ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్‌ 2023-24 డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో 24 శాతం పెరుగుదలతో రూ.10,271 కోట్ల నికర లాభాలు సాధించింది. రూ.9,950 కోట్ల లాభాలు నమోదు చేయవచ్చని బ్లూమ్‌బర్గ్‌ వేసిన అంచనాల కంటే మెరుగైన ఫలితాలు ప్రకటించింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.18,679 కోట్లుగా చోటు చేసుకుంది. ఇతర ఆదాయం 21 శాతం వృద్థితో రూ.6,097 కోట్లుగా నమోదయ్యింది.

➡️