మెగా డిఎస్‌సి అడిగితే.. నిరుద్యోగ ఉపాధ్యాయులు అరెస్ట్‌

Jan 10,2024 22:11 #ap cm jagan, #CM camp office, #Dharna, #DYFI
  • డివైఎఫ్‌ఐ నేతలకు గాయాలు
  • ఉద్రిక్తంగా సిఎం కార్యాలయ ముట్టడి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్‌సిని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఉపాధ్యాయలు చేసిన ఆందోళనపై ప్రభుత్వం విరుచుకుపడింది. సిఎం క్యాంపు కార్యాలయ పరిసరాల్లోకి వారిని రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను దాటుకుపోవడానికి నిరుద్యోగులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు దూకుడుగా వ్యవహరించి, అరెస్ట్‌లు చేయడంతో పలువురు డివైఎఫ్‌ఐ నేతలకు గాయాలయ్యాయి. డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల కోసం పిఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి డివైఎఫ్‌ఐ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పెద్దసంఖ్యలో నిరుద్యోగ ఉపాధ్యాయులు బుధవారం విజయవాడకు చేరుకున్నారు. రాణిగారితోట నుంచి తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం వద్దకు ప్రదర్శనగా బయలుదేరారు. అక్కడ ముందుగానే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పోలీసులు విచక్షణా రహితంగా నిరుద్యోగులను ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. ఈ క్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు కర్నూలు హుసేన్‌ భాష, రాజు, ఇమ్రాన్‌లకు గాయాలయ్యాయి. ఇళ్లల్లో ఉన్న డిఎస్సి అభ్యర్ధులను సైతం పోలీసులు వదల్లేదు. వారిని కూడా బలవంతంగా అరెస్టులు చేశారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము, జి రామన్నలను పోలీసులు ముందుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో డివైఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, రాజు, నగేష్‌, బాబు, నాయకులు పి కృష్ణ, ఆంజనేయరాజు, కృష్ణకాంత్‌, పిచ్చయ్య, హరిష్‌, శివాజి, ప్రసన్న సింగ్‌, శర్మ, నరసింహ, చరణ్‌, శివ మదు తదితరులు ఉన్నారు. ముట్టడి నేపధ్యంలో తాడేపల్లి, వారధి చుట్టుపక్కల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నయవంచనప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ అమలు చేయకుండా నయవంచన చేసిందని డివైఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు వై రాము, జి రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి డిఎస్సి పేరుతో టోపి పెట్టిందని విమర్శించారు. వెంటనే 25వేల టీచర్‌ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 40వేల ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటించిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 117 జివో పేరుతో 2వేల పాఠశాలలను మూసివేసిందని తెలిపారు. తెలుగు మీడియం రద్దు చేసి మరో 15వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 9వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం 10లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం-2020 అమలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అరెస్టులను ఖండించిన ఎస్‌ఎఫ్‌ఐ, కెవిపిఎస్‌ నిరుద్యోగ అభ్యర్ధుల అరెస్టులను ఎస్‌ఎఫ్‌ఐ, కెవిపిఎస్‌ విడివిడిగా ఖండించాయి. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు కె ప్రసన్న కుమార్‌ఎ అశోక్‌, కెవిపిఎస్‌ ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి వేరువేరుగా ప్రకటనలు విడుదల చేశారు. మెగా డిఎస్సి విడుదల చేస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

 

➡️