36 హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు..!

Feb 4,2024 12:49 #36, #Attacks, #Houthi bases, #US

వాషింగ్టన్‌ (అమెరికా) : హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడికి వ్యతిరేకంగా … హౌతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్నారు. దీంతో అమెరికా సహా 12 దేశాలు ఏకమై ఎర్ర సముద్రంలో హౌతీలపై విరుచుకుపడ్డాయి.

13 ప్రదేశాల్లో 36 స్థావరాలపై దాడులు..

యెమెన్‌లో డజన్ల కొద్ది హౌతీ స్థావరాలపై అమెరికా, యుకె దాడులు జరిపాయి. దాదాపు 13 ప్రదేశాల్లో 36 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. హౌతీల ఆయుధ సామాగ్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా కూటమి స్పష్టం చేసింది. హౌతీల ఆయుధాల నిల్వలపై, క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్‌లతో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై ప్రయోగించడానికి సిద్ధమైన ఆరు హౌతీ యాంటీ షిప్‌ క్షిపణులపై అమెరికా సంయుక్త దళాలు విడివిడిగా దాడులు చేశాయని సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది.

”అంతర్జాతీయ వాణిజ్య షిప్పింగ్‌తో పాటు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై హౌతీల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా యెమెన్‌లోని 13 ప్రదేశాలలో 36 హుతీ స్థావరాలపై దాడి చేశాం” అని యునైటెడ్‌ స్టేట్స్‌, బ్రిటన్‌ సహా ఇతర దేశాల కూటమి స్పష్టం చేసింది.

హౌతీలు దాడులు ఆపకపోతే మరిన్ని కఠిన చర్యలు : అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌

13 ప్రాంతాల్లో 36 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ వెల్లడించారు. ఈ చర్యల్లో తమకు ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌, కెనడా, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌ నుంచి మద్దతు లభించినట్లు తెలిపారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులను ఆపకపోతే.. వారు మరిన్ని కఠినమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

➡️