కేంద్రంలో పేరుకుపోతున్న ‘ఉపాధి’ బకాయిలు

Dec 7,2023 09:31 #MGNREGS, #Upadi Hami Padhakam
upadhi hami pathakam funds adhaar link

రాష్ట్రానికి వేతన బకాయిలే రూ.110.56 కోట్లు
సకాలంలో ఇవ్వకుండా వంచిస్తున్న మోడీ సర్కార్‌
ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తూనేవుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ పథకానికి నిధులు సమకూర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీసం ఉపాధి కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలకు సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో యేటికేడూ కేంద్రం ప్రభుత్వం ‘ఉపాధి’ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.110.56 కోట్ల ఉపాధి హామీ వేతనాల బకాయిలు ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 నవంబర్‌ 29 వరకు ఎపికి రూ.110.56 కోట్లు వేతనాలకు సంబంధించిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు రూ.10.96 కోట్లు బాకాయిలు ఉన్నాయని తెలిపారు.రూపాయి కూడా విదిల్చని కేంద్రం : విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు 15వ ఆర్థిక సంఘం నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023-24లో ఎపికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,031 కోట్లు కేటాయించగా, అందులో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కేంద్ర మంత్రి తెలిపారు.

➡️