గాజాకి మానవతా సాయాన్ని పెంచాలి : యుఎన్‌

Dec 21,2023 15:29 #israel hamas war, #UN Chief

జెనీవా  :    గాజాలో మానవతాసాయాన్ని పెంచాల్సి వుందని ఐరాస పేర్కొంది. ఇజ్రాయిల్‌ బాంబు దాడులతో గాజాలో వేలాది మంది నిరాశ్రయులు కావడంతో పాటు ఆకలి, నీటి ఎద్దడి తీవ్రమైన సంగతి తెలిసిందే. దీంతో గాజాలో ”భారీ స్థాయిలో మానవతా సాయం కార్యకలాపాలు” అనుమతించేలా పరిస్థితులు మెరుగుపడాలని ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • ఆస్పత్రుల్లో నిలిచిన సేవలు

ఇంధనం, సిబ్బంది, సామాగ్రి కొరతతో ఉత్తర గాజాలోని ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొంది. అల్‌-అహ్లీ ఆస్పత్రి చివరిదని, అది కూడా కనిష్టంగా సేవలను అందిస్తోందని గాజాలోని డబ్ల్యుహెచ్‌ఒ ప్రతినిధి రిచర్డ్‌ పీపర్‌సన్‌ వీడియో లింక్‌లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ గాజాపై దాడులను కొనసాగిస్తోంది. తాజాగా రఫాలోని ఆస్పత్రి సమీపంలో, ఉత్తర జాబాలియా శరణార్థి శిబిరంపై బాంబులతో విరుచుకుపడింది. దీంతో తమ అత్యవసర వైద్య బృందం రఫా సరిహద్దుకు చేరుకుంటోందని పాలస్తీనా రెడ్‌ క్రెసెంట్‌ ఇఎంఎస్‌ టీమ్స్‌ (పిఆర్‌సిఎస్‌) పేర్కొంది.

ఉత్తర గాజాలోని జాబాలియా శరణార్థి శిబిరానికి చెందిన మెడికల్‌ ఛారిటీ అంబులెన్స్‌ సెంటర్‌ను ఇజ్రాయిలీ సైన్యం చుట్టుముట్టిందని పిఆర్‌సిఎస్‌ తెలిపింది. సైన్యం కాల్పులతో పాటు బాంబులతో దాడి చేపడుతోందని ఎక్స్‌లో పేర్కొంది. ఆ సెంటర్‌లో పారామెడికల్‌ సిబ్బంది, వాలంటీర్లు, వారి కుటుంబాలు మొత్తం 127 మంది తలదాచుకున్నారని, వారిలో 22 మంది మహిళలు కూడా ఉన్నారని ఆ ట్వీట్‌లో తెలిపింది.

  • కొనసాగుతున్న దాడి

గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను కొనసాగిస్తోంది. తాజాగా సెంట్రల్‌ మరియు దక్షిణ ఖాన్‌యునిస్‌లో 20 శాతం మందిని ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్‌ సైన్యం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడిలో సుమారు 20,000 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా మీడియా కార్యాలయం తెలిపింది.

➡️