రిజర్వేషన్లపై యుజిసి కత్తి

Jan 29,2024 11:02 #UGC
ugc attacks on reservations

అభ్యర్థులు అందుబాటులో లేకపోతే  డిరిజర్వ్‌ చేయాలని ప్రతిపాదన

 వెల్లువెత్తుతున్న విమర్శలు

న్యూఢిల్లీ : రిజర్వ్‌డ్‌ పోస్టులకు తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి అభ్యర్థుల కోసం రిజర్వ్‌ చేసిన పోస్టులను డి రిజర్వ్‌ చేయాలని యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) వివాదాస్పద సూచనలు చేసింది. ‘భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో రిజర్వేషన్‌ విధానం అమలు చేయడం కోసం మార్గ దర్శకాలు’పై భాగస్వాముల నుంచి అభిప్రా యాలు కోరగా యుజిసిపై విధంగా ప్రతిపాదించింది. ”ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి అభ్యర్థుల కోసం రిజర్వు చేయబడిన పోస్టులను ఈ అభ్యర్థులు కాకుండా వేరే అభ్యర్థిలతో భర్తీ చేయలేం. అయితే, డి-రిజర్వేషన్‌ విధానాన్ని అనుసరించడం ద్వారా రిజర్వ్‌ చేయబడిన ఖాళీని అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించవచ్చు, ఆ తర్వాత దానిని అన్‌రిజర్వ్‌డ్‌ ఖాళీగా భర్తీ చేయవచ్చు” అని యుజిసి తన ప్రతిపాదనల్లో తెలిపింది. ”డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ సమయంలో రిజర్వ్‌ చేయబడిన ఖాళీలను డి-రిజర్వేషన్‌ చేయడంపై నిషేధం ఉంటుందని, అయితే, అరుదైన-అసాధారణమైన సందర్భాల్లో గ్రూప్‌ ఎ సర్వీస్‌లోని ఖాళీని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఖాళీగా ఉంచడానికి అనుమతించబడనప్పుడు, సంబంధిత విశ్వవిద్యాలయం కింది సమాచారాన్ని అందజేస్తూ ఖాళీని డి-రిజర్వేషన్‌ కోసం ప్రతిపాదనను సిద్ధం చేయవచ్చు: ప్రతిపాదనల్లో ఖాళీలను పూరించడానికి చేసిన ప్రయత్నాలు, ఖాళీగా ఉండటానికి అనుమతించబడకపోవడానికి కారణాలు, డి-రిజర్వేషన్‌ కోసం సమర్థన జతచేయాలి. గ్రూపు సి, డి పోస్టుల్లో డి-రిజర్వేషన్‌ కోసం ప్రతిపాదనను విశ్వవిద్యాలయం యొక్క కార్యనిర్వాహక మండలికి, మరియు గ్రూప్‌ ఎ, బి పోస్టుల్లో ప్రతిపాదనను విద్యా మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. ఈ ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత ఆమోదం ఇచ్చి సదరు పోస్టును భర్తీ చేయవచ్చు” అని యుజిసి తన ప్రతిపాదనల్లో తెలిపింది. అలాగే పదోన్నతి విషయంలోనూ ప్రమోషన్‌కు తగిన సంఖ్యలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, అటువంటి ఖాళీలను డి-రిజర్వ్‌ చేసి ఇతర కేటగిరీల అభ్యర్థులతో భర్తీ చేయవచ్చునని తెలిపింది. కొన్ని షరతులతో రిజర్వ్‌ చేయబడిన ఖాళీలను డి-రిజర్వేషన్‌ చేసే అధికారం యుజిసి, విద్యా మంత్రిత్వ శాఖకు అప్పగించాలని తెలిపింది. యుజిసి చేసిన ప్రతిపాదనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిపాదనలపై జెఎన్‌యు స్టూడెంట్స్‌ యూనియన్‌ (జెఎన్‌యుఎస్‌యు) నిరసన ప్రకటించింది. యుజిసి చైర్మన్‌ ఎం జగదీష్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ఈ విమర్శలపై యజిసి ఇంకా స్పందించలేదు. అయితే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ అంశంపై ఆదివారం స్పందించింది. యుజిసి ప్రతిపాదనలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రకటనలో తెలిపింది.

తిరోగమన చర్య : సీతారాం ఏచూరి

మోడీ పాలన ప్రమోట్‌ చేస్తున్న దళిత వ్యతిరేక, ఆదివాసీ వ్యతిరేక మనువాదీ సమాజ నిర్మాణానికి అనుగుణంగా యుజిసి సిఫార్సులు చేయడం అత్యంత తిరోగమన చర్య. ఎస్‌సి, ఎస్‌టిల్లో అర్హులు లేరని ప్రచారం చేయడం, పోస్టులు డిరిజర్వ్‌ చేయడం కుల ఆధారిత అణిచివేతకు కొనసాగింపు. ఈ సిఫార్సులు వెంటనే ఉపసంహరించుకోవాలి.

➡️