శ్రీవారి ఆలయంలోవేడుకగా ఉగాది ఆస్థానం

శ్రీవారి ఆలయంలోవేడుకగా ఉగాది ఆస్థానం

శ్రీవారి ఆలయంలోవేడుకగా ఉగాది ఆస్థానంప్రజాశక్తి- తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈకార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు శ్రీవిశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ, భక్తులందరికీ నూతన తెలుగు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో డిఎల్‌ఓ వీర్రాజు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, విజివో నంద కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.భక్తులను విశేషంగా ఆకట్టుకున్న ఫల – పుష్ప అలంకరణలుతిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల,పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60వేల కట్‌ఫ్లవర్స్‌ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, బత్తాయి, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా అయోధ్య రామాలయం, బాల రాముడి సెట్టింగ్‌, నవధాన్యాలతో రూపొందించిన మత్స అవతారము భక్తులను మైమరిపించింది. ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన త్రేతా, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవెంకటేశ్వర స్వామి, శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీమహావిష్ణువు దశావతారాలు, ఉద్యానవనంలో ఆడుకుంటున్న రామలక్ష్మణుల సమేత హనుమంతుల వారు, బాలకృష్ణుడు వంటి పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బయట భక్తులు తమ చరవాణుల్లో ఫలపుష్ప ఆకృతులతో ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. టీటీడీ గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, టీటీడీ గార్డెన్‌ సిబ్బంది 100 మంది రెండు రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల, పుష్ప ఆకృతులను రూపొందించారు.

➡️