గంట వ్యవధిలో రెండు ప్రమాదాలు – ఇద్దరి పరిస్థితి విషమం

Mar 12,2024 11:26 #Accidents, #serious, #two, #within an hour

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : గంట వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకే ఊరికి చెందిన నలుగురు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటనలు మంగళవారం మార్టూరు రూరల్‌లో జరిగాయి. రాంగ్‌ రూట్‌ లో ఎదురుగా వస్తున్న బైక్‌ లను తప్పించబోయి… మరో రెండు బైక్‌ లు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌లను ఢకొీట్టుకోవడంతో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నలుగురు యువకులు డెకరేషన్‌ పనికి వచ్చి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఎన్‌ హెచ్‌ అంబులెన్సు సిబ్బంది ప్రేమ్‌ చంద్‌, సుధీర్‌, చైతన్య తెలిపిన వివరాల ప్రకారం … విజయవాడ, మంగళగిరి పట్టణాలకు చెందిన భాగ్యరాజు, జగదీశ్‌, పవన్‌, నవీన్‌ మరికొంతమంది యువకులతో కలిసి ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమానికి డెకరేషన్‌ చేసే నిమిత్తం వచ్చారు. పని పూర్తి కావడంతో తిరిగి తమ బైక్‌ లపై విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో ముందుగా మార్టూరు సమీపంలోని అమరావతి మిల్లు సమీపంలో జాతీయ రహదారిలో పల్సర్‌ బైక్‌పై భాగ్యరాజు, జగదీశ్‌ లు వెళుతున్నారు. ఇంతలో … వారికి ఎదురుగా రాంగ్‌ రూట్‌ లో మరో బైక్‌ అతి వేగంగా వస్తుండటంతో అయోమయానికి గురైన భాగ్యరాజు బండిని పక్కనే ఉన్న రోడ్డు డివైడర్‌ కి ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో జగదీష్‌, భాగ్యరాజు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి అంబులెన్స్‌ చేరుకుంది. క్షతగాత్రులను హై వే అంబులెన్స్‌లో ముందుగా మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారి వద్ద ఉన్న ఫోన్‌ ద్వారా విజయవాడలోని వారి బంధువులకు సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించడానికి 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో వారిని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలలోనే ఉంచారు.

ఇదిలా ఉండగా… మరోవైపు మార్టూరు వద్ద జరిగిన ప్రమాదం గురించి తెలియని పవన్‌, నవీన్‌ లు తమ స్కూటీ పై విజయవాడకు వెళుతున్న క్రమంలో రాజుపాలెం సమీపంలో మరో బైక్‌ వీరికి ఎదురుగా రావడంతో స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ ని ఢకొీట్టింది. ఈ ఘటనలో స్కూటీ పై ప్రయాణిస్తున్న పవన్‌, నవీన్‌ ల రెండు కళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. మొదటి ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు వైద్యశాలలో ఉండగానే తిరిగి మరో ఇద్దరు యువకులు అదే విధంగా ప్రమాదానికి గురవ్వడంతో సమాచారం అందుకున్న హై వే అంబులెన్స్‌ మరో ప్రమాదంలో గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను స్థానిక వైద్యశాలకు తరలించారు. రెండు వేర్వేరు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడ్డ నలుగురు యువకులను ఒంగోలు కేసుకు వెళ్లిన మార్టూరు 108 వాహనం తిరిగి రావడంతో అందులో గుంటూరు సర్వజన సమగ్ర వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️