ఒకే నాయకుడు.. రెండు పార్టీలు

Apr 9,2024 20:55

 టిడిపికి రాజీనామా చేయకుండానే జనసేనలో చేరిక

టిక్కెట్‌ కోసం తంటాలు

అయోమయంలో టిడిపి కేడర్‌

పాలకొండలో వింతరాజకీయం

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/పాలకొండ  : అనగనగా ఒక నాయకుడు… మరో నాయకురాలు… ఇందులో ఒకరు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి… మరొకరు టిడిపి నియోజకవర్గ స్థాయి నాయకురాలు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ ఒకరికొకరు పోటీగా జనసేన అధినేతను కలిసి ఆ పార్టీ కండువా కప్పేసుకున్నారు. తమ కేడర్‌కు ఇక మనం జనసేనలో చేరిపోయినట్టే అంటూ ఇద్దరూ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. అలాగని టిడిపికి రాజీనామా చేశారా? అంటే అటువంటి నీతి ఎక్కడా కనిపించలేదు. దీంతో, ఏం చెయ్యాలో అర్థం కాక ఆయా పార్టీలకు చెందిన దిగువస్థాయి నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఇక సాధారణ జనం కూడా వీరి రాజకీయ విన్యాలసాలను చూసి విస్తుపోతున్నారు. ఇదీ పాలకొండ టిడిపి, జనసేన పార్టీల్లో నెలకున్న దుస్థితి. పాలకొండ నియోజకవర్గం వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతిని ప్రకటించిన విషయం విధితమే. టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు నిర్ణయించుకున్నారు. నిర్ణయమైతే జరిగింది గానీ, అంతపాటి అభ్యర్థి లేరట. ఆ మాటకొస్తే అభ్యర్థి మాత్రమే కాదు. కార్యకర్తలు కూడా ఆ పార్టీకి పెద్దగా లేరు. దీంతో, జనసేనకు ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి. దీంతో, టిడిపి తరపున టిక్కెట్‌ ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఈనెల 1వ తేదీన పిఠాపురం వారాహి యాత్రలోవున్న పవన్‌ కల్యాణ్‌ను కలిసి జనసేన కండువా కప్పేసుకున్నారు. కండువా కప్పుకున్నదే తడువుగా నియోజకవర్గంలోకి వచ్చి తాను జనసేనలో చేరిపోయాయని, ఆ పార్టీ తరపున పాలకొండ అసెంబ్లీ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని తెగేసి చెప్పుకుంటున్నారు.

ఒకే నాయకుడు.. రెండు పార్టీలు

దీంతో, అప్రమత్తమైన మరో టిడిపి టిక్కెట్‌ ఆశావహురాలు పడాల భూదేవి కూడా ఈనెల 7న అనకాపల్లిలో పవన్‌ కల్యాణ్‌ను కలిసి జనసేన కండువా కప్పేసుకున్నారు. ఆమె కూడా జయకృష్ణ మాదిరిగా జనసేన టిక్కెట్‌ నాకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు వారు దశాబ్ధాలు తరబడి కొనసాగుతున్న టిడిపికి మాత్రం రాజీనామాలు చేయలేదు. దీంతో, ఇద్దరు నాయకులు రాజీనామాలు చేయకుండా మనకి మాత్రం పంగనామాలు పెడుతున్నారంటూ పాలకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి, అక్కడక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. నాయకులు లేనప్పుడు జనసేన ఈ స్థానం నుంచి టిక్కెట్‌ అడగడమెందుకు, టిడిపి అంగీకరించడం దేనికి అంటూ జనం (మిగతా.. 3లో)ప్రశ్నంచుకుంటున్నారు. మొత్తానికి పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్నప్పటికీ పాలకొండలో జనసేన, టిడిపి కూటమి తమ అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితి దాపురించింది. మరోవైపు ఇదే అదునుగా వైసిపి అభ్యర్థి హేట్రిక్‌ సాధించేందుకు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు. ఒకే పార్టీలో ఉంటూనే నిన్నమొన్నటి వరకు ఉత్తర దక్షణ ధ్రువాల్లో ఉన్న కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌బాబు కలిసి నియోజకవర్గ రాజకీయాలను చక్కబెట్టు కుంటున్నారు.

➡️