ఇషికావా తీరాన్ని తాకిన సునామీ.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్‌

Jan 1,2024 15:34 #Earthquake, #Japan, #Tsunami

 టోక్యో :    జపాన్‌లో వరుస భూ ప్రకంపనల అనంతరం సునామీ తాకింది. సెంట్రల్‌ జపాన్‌ ఉత్తర తీరంలో ఒక మీటర్‌ కంటే ఎక్కువ ఎత్తులో అలలు విరుచుకుపడినట్లు అధికారులు తెలిపారు. ఇషికావాలోలోని వాజిమా ఓడరేవును 1.2 మీటర్ల ఎత్తులో అలలు తాకాయని జపాన్‌ వాతావరణ సంస్థ తెలిపింది. ఐదు మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరించింది.

సోమవారం ఉదయం రిక్టర్‌స్కేలుపై 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ఇషికావా, హోన్షు ద్వీపంలోని పశ్చిమ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.  స్థానికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జపాన్‌ స్టేట్‌ క్యాబినెట్‌ సెక్రటరీ యోషిమాసా హయాషి హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం నుండి 4.0 తీవ్రతతో వరుసగా 90 నిమిషాల వ్యవధిలో 21 ప్రకంపనలు వచ్చాయని, దీంతో 33,500 నివాసాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని హోకురికు ఎలక్ట్రిక్‌ పవర్‌ సంస్థ తెలిపింది. పలు జాతీయ రహదారులను మూసివేశారు. ఇషికావాలోని నోటో ప్రాంతం మరియు టోక్యోకు మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపారు.

సునామీ మరియు భూకంపం ప్రభావిత ప్రాంతాల్లోని అణు విద్యుత్‌ ప్లాంట్ల నుండి రేడియో ధార్మికత లీక్‌ అయ్యే ప్రమాదం లేదని జపాన్‌ న్యూక్లియర్‌ రెగ్యులేషన్‌ అథారిటీ అధికారి తెలిపారు. రష్యా తూర్పు నగరాలైన వ్లాడివోస్టాక్‌, నఖోడ్కాల్లో కూడా సునామీ హెచ్చరికను జారీ చేసినట్లు నగరమేయర్‌లను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది.

➡️