ప్రజలను తప్పుదారి పట్టించే యత్నమే!

Mar 31,2024 23:35 #Ailu's criticism, #lawyers' letter

న్యాయవాదుల లేఖపై ఐలూ విమర్శ
న్యూఢిల్లీ : న్యాయ వ్యవస్థను పరిరక్షించాలంటూ ఇటీవల కొంతమంది న్యాయవాదుల బృందం ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాయడమంటే ప్రజలను తప్పుదారి పట్టించే యత్నమేనని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌ సాల్వె, అదిష్‌ అగర్వాల్‌ కూడా లేఖ రాసిన బృందంలో వున్నారు. అవినీతిని ఎండగడుతూ ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రత్యక్ష ప్రభావమే ఈ లేఖ అని ఐలూ పేర్కొంది.
న్యాయవ్యవస్థ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల పరిరక్షణ కోసం, భారత రాజ్యాంగం మౌలిక వ్యవస్థను పరిరక్షించేందుకు నిరంతరంగా పోరాడుతున్న బాధ్యాతాయుతమైన న్యాయవాదులు, న్యాయవాదుల సంఘాలకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలతో రాసిన లేఖ మాత్రమేనని ఐలూ నేతలు, సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ ఎంపి వికాస్‌ రంజన్‌ భట్టాచార్య, సీనియర్‌ న్యాయవాది పి.వి.సురేంద్రనాథ్‌ విమర్శించారు. న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రంతోపాటు రాజ్యాంగ మౌలిక వ్యవస్థపై కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యక్ష దాడి చేసినప్పుడు గతంలో ఈ న్యాయవాదుల బృందం మౌనంగా వుందని గుర్తు చేశారు. పార్లమెంట్‌ ఆధిక్యత పేరుతో బాధ్యాతాయుతమైన పదవుల్లో వున్నవారు న్యాయ సమీక్షపై, మౌలిక వ్యవస్థపై దాడి చేశారని వారు పేర్కొన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక వర్గం పాత్ర ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీల్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటోందని ఐలూ విమర్శించింది.
ఎన్నికల బాండ్ల కేసులో తీర్పు, అప్రజాస్వామికంగా పిఐబి ఏర్పాటు చేసిన వాస్తవాల నిర్ధారణ కమిటీ వంటి అంశాలు న్యాయవాదుల బృందాన్ని అసహనానికి గురిచేశాయని ఐలూ పేర్కొంది. ఆ లేఖలో పేర్కొన్న నిరాధారమైన ఆరోపణలు దేశవ్యాప్తంగా గల న్యాయవాదుల, న్యాయ నిపుణుల సాధారణ అభిప్రాయం కాదని స్పష్టం చేసింది.

➡️