ట్రోలింగ్‌

Mar 17,2024 06:09 #edite page, #Editorial, #trolling

సాంకేతికత పెరగడం అంటే అభివృద్ధికి ఆసరాగా నిలవటం. మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం. అయితే, ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తితో ఆడుకోవడం… మానసికంగా హింసించడం పరిపాటిగా మారింది. నేటి ఆధునిక సాంకేతికత మనిషిని మనిషిని దగ్గర చేసేదిలా ఉండాలి. మనుషుల మధ్య దూరాల్ని దారంలా కలపాలి. కానీ, కొంతమంది మాటల విరుపులతో, హింసాత్మక పద ప్రయోగాలతో, వక్రభాష్యాలతో ఎదుటివారి మనసులను గాయపరచడమే పనిగా పెట్టుకుంటున్నారు. నిరంకుశత్వం అన్ని జీవిత పార్శ్వాలను, మానవ సంబంధాలను విషపూరితం చేయడానికి కొన్ని సాంకేతిక సాధనాలను సమకూర్చుకుంటున్నది. అలాంటి వాటిలో ట్రోలింగ్‌ ఒకటి. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించడం కోసం ఏర్పడిన ట్రోలింగ్‌… ఇప్పుడు అదుపుతప్పి తిట్లు, బెదిరింపులు, దాడులు, అభిప్రాయాల నిర్మూలన రూపంలోకి మారింది. ఆయా ప్రాంతాల సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై ఆధారపడి ఎప్పటికప్పుడు ట్రోలింగ్‌ తన రూపం మార్చుకుంటున్నది. మనదేశంలో లింగ, మత, కుల వివక్ష ఆధారంగా ఎక్కువ ట్రోలింగ్‌ జరుగుతోంది. మరోవైపు ఇదో రాజకీయాస్త్రంగా తయారైంది. ఈ ట్రోలింగ్‌కి ఎవరూ అతీతం కాకపోయినా.. మహిళల పట్ల జరిగే ట్రోలింగ్‌ తీవ్రత మరింత ఎక్కువగా వుంటోంది.
‘రాజకీయాలు, మతాలు స్త్రీలపై జరిపే హింసకు మధ్య సంబంధాన్ని విశ్లేషించిన ప్రతిసారీ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఐటీసెల్‌ పనిగట్టుకొని దాడికి దిగింది’ అంటారు బాధితురాలైన ఒక సాంస్కృతిక కార్యకర్త. పేరును, ముఖాన్ని దాచుకొని అంతర్జాలం వేదికగా ఆడే విద్వేష క్రీడ ట్రోలింగ్‌. ఈ ట్రోలింగ్‌ భూతం ఎవరినీ వదిలి పెట్టడంలేదు. అమాయకులను మింగేస్తోంది. సోషల్‌ మీడియా ముసుగేసుకున్న సోమరిపోతులు కొందరు… ట్రోలింగ్‌ పేరుతో చావు డప్పు మోగిస్తున్నారు. అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు, రచయితలు, జర్నలిస్టులు, ఉపన్యాసకులు వంటి వారిపై గురిపెట్టి అశ్లీల, అసభ్య పదజాలంతో వ్యక్తిత్వ హననం లక్ష్యంగా దాడులు చేయడం మన కళ్లముందర ఆవిష్కృతమౌతున్న నగదృశ్యం. కాశ్మీర్‌పై బిజెపి అనుసరిస్తున్న విధానాలపై అనేక కథనాలు రాసిన స్వాతి చతుర్వేది విపరీతమైన, ద్వేషపూరితమైన ట్రోల్‌కు గురైంది. తనపై జరుగుతున్న ట్రోల్‌ గురించి తెలుసుకునేందుకు ఆమె చేసిన పరిశోధనే ‘ఐ యామ్‌ ఎ ట్రోల్‌’ అనే పుస్తకం. బిజెపి డిజిటల్‌ సైన్య నిర్మాణ వ్యూహాలను ఈ పుస్తకంలో బయటపెట్టింది. అంతేకాదు… పాకిస్తాన్‌ మీద మ్యాచ్‌ ఓడిపోయినందుకు బౌలర్‌ మహమ్మద్‌ షమీ కారణమని ట్రోల్‌ చేస్తుంటే, షమీకి మద్దతుగా వచ్చిన విరాట్‌ కోహ్లీ పైనా ట్రోల్స్‌ జరిగాయి. తన పద్దెనిమిది నెలల కూతుర్ని రేప్‌ చేస్తామని ట్వీట్స్‌ చేశారంటే… ట్రోలింగ్‌ స్వభావం ఏ స్థాయికి చేరిందో అర్థమౌతుంది. తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి ట్రోలింగ్‌ పెట్టిన హింసతో తన జీవితాన్ని బలిచేసుకుంది. ఇలాంటి సంఘటనలెన్నో నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
ట్రోలింగ్‌ని అరికట్టాల్సిన ప్రభుత్వాలే వీటిని ప్రోత్సహిస్తున్నాయి. సాక్షాత్తూ దేశ ప్రధాని సైతం ట్రోలింగ్‌ అకౌంట్లను ట్విటర్‌లో ఫాలో అవుతున్నట్లు కొన్ని పత్రికలు చేసిన పరిశోధనల్లో బయటపడింది. అంటే- ‘ప్రశ్నించే గొంతుకలంటూ వుంటే ఇలానే పబ్లిక్‌లో హేళనకు గురికావాల్సి వస్తుంది. మిమ్మల్నే కాదూ… మీ కుటుంబాలను, అందులోనూ ఇంట్లోని ఆడవాళ్లనూ ఇందులోకి లాగుతాం. కనుక, మీ చుట్టూ ఏం జరుగుతున్నా నోరు, కళ్లు, చెవులు మూసుకుని కూర్చోండి’ అనే హెచ్చరిక వుంది అంటారు సామాజిక వ్యాఖ్యాత అరుణాంక్‌ లత. నిరంతరం ట్రోలింగ్‌కి గురవుతున్నవారు వాటిని భరించలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనం మనం చూస్తూనే వున్నాం. సమాజ చైతన్యం కోసం బయటకు వచ్చే వారిని టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. వీరికి లాజిక్‌ లేదు, విచక్షణ లేదు, మానవత్వం అంతకన్నా లేదు. ఇదొక ఉన్మాదం. ఇదిలా కొనసాగడం విజ్ఞతకు, విచక్షణకు, విజ్ఞానానికి అత్యంత ప్రమాదకరం. విచక్షణారహితంగా రెచ్చిపోతున్న సైకోలను కట్టడి చేయకపోతే ఈ ట్రోలింగ్‌ భవిష్యత్‌ తరాల్ని మానసిక వికలాంగులుగా మార్చేస్తుంది. కనుక ఈ ట్రోలింగ్‌ భూతాన్ని అరికట్టాలి.

➡️