కారం-వికారం

trivikram misuse marx lenin names article

1950 దశకంలో హిందీలో ‘ఆవారా’ సినిమా పెద్ద సంచలనం కలిగించింది. ఇప్పటి తరాలవారు సైతం ఆ సినిమాను చూస్తే మెచ్చుకుంటారు.

ఆ సినిమాలో ఇతివృత్తం ఏమిటి? ఒక ముద్దాయిని దొంగతనం చేశాడంటూ నిర్ధారించి శిక్ష విధించిన జడ్జిగారు ”దొంగ కొడుకు దొంగ కాక ఇంకేమౌతాడు?” అని వ్యాఖ్యానిస్తాడు.

సదరు దొంగ జైలు నుంచి తప్పించుకుని ఆ జడ్జిగారి కొడుకుని ఎత్తుకుపోయి తన వద్దే ఉంచుకుని దొంగగా తయారు చేస్తాడు. చనిపోతూ తాను చేసిన తప్పును ఆ అబ్బాయి దగ్గర చెప్పుకుంటాడు. పరిస్థితుల ప్రభావం వలన మనుషుల వ్యక్తిత్వాలు, సామర్ధ్యాలు రూపొందుతాయి తప్ప పుట్టుకను బట్టే మనిషి గొప్పవాడో, మంచివాడో లేక చెడ్డవాడో అయిపోడు-అన్నది ‘ఆవారా’ సినిమా సందేశం. ఒక శాస్త్రీయమైన భావనను శక్తివంతంగా చెప్పిన సినిమా గనుకనే ఆవారా సినిమాను ఇంకా ఆదరిస్తున్నారు.

కొద్ది కాలం క్రితం ”అల వైకుంఠపురంలో” సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక గుమస్తా భార్య, అతడి యజమాని భార్య ఒకే ఆస్పత్రిలో, ఒకే సమయంలో ప్రసవిస్తారు. ఆ గుమాస్తా తన బిడ్డను యజమాని బిడ్డను మార్చేస్తాడు. పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఆ యజమానికి పుట్టిన బిడ్డ గుమాస్తా కొడుకుగా పెరిగినా, యజమాని కుటుంబానికి వచ్చిన కష్టాలన్నీ అలవోకగా తీర్చేస్తాడు. గుమాస్తాకి పుట్టిన బిడ్డ యజమాని ఇంట్లో పెరిగినా చేతకానివాడిలాగే ఉండిపోతాడు. పుట్టుకను బట్టి, వంట్లోని డిఎన్‌ఎ ని బట్టి మనుషుల సామర్ధ్యాలు, వ్యక్తిత్వాలు రూపొందుతాయి అన్నది ఈ సినిమా సందేశం. గొప్పవాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళే అవుతారు అని చెప్పడం దర్శకుని ఉద్దేశ్యం. ”అలాంటి గొప్పవాడికి పుట్టిన నువ్వు గొప్పవాడివే అవుతావు” అని సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి” సినిమాలో కూడా అనిపిస్తాడు ఇదే దర్శకుడు.

పుట్టుకను బట్టే ఎక్కువ, తక్కువలు ఉంటాయన్నది కులతత్వవాదుల వాదన. మనువాదం కూడా ఆ ప్రాతిపదికనే ఉంటుంది. ”పుట్టుకతోటే గొప్పవాళ్ళం మేము” అని విర్రవీగే అగ్రవర్ణ దురహంకారుల ధోరణికి దర్పణం. అయితే శాస్త్రజ్ఞులు అనేక జన్యు పరిశోధనలు చేసి మనుషుల పుట్టుకకు, వారి వారి సామర్ధ్యాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అందుచేత ఈ ”పాపులర్‌” దర్శకుడు మరియు చతుర సంభాషణల రచయిత అత్యంత చతురతతో అత్యంత పనికిమాలిన చెత్త భావాలను, తిరోగమన దృక్పథాన్ని తన సినిమాల ద్వారా జనాల మెదళ్ళలోకి ఎక్కిస్తున్నాడన్నమాట.

ఇతగాడిదే ఇంకో సినిమా ‘జులాయి’. అందులో హీరో ఒక టీచర్‌ కొడుకు. చాలా త్వరగా గొప్పవాడైపోవాలనుకుని చిక్కుల్లో పడతాడు. వేల కోట్ల రూపాయల స్కామ్‌ చేసిన విలన్ల భరతం పట్టి ఆ సొమ్మును తిరిగి ఖాతాదారులకు అందజేస్తాడు. అసాధారణ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శిస్తాడు. ఐతే చివరిలో బుద్ధిగా ఒక సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా జీవితం ప్రారంభిస్తాడు. అంతే కాదు, వేగంగా ఎదగాలనుకోవడం మధ్య తరగతి యువకులు చేయకూడని పని అని ఇంకొకడికి సలహా కూడా ఇస్తాడు. మళ్ళీ అదే సారాంశం. బలమైన టెక్నిక్‌తో, పంచ్‌ డైలాగులతో, హాస్యంతో మేళవించి ఈ చెత్త భావాలను సమాజంలోకి పంపించడం ఇతగాడి ప్రత్యేక ప్రతిభ. ఎవరి బతుకులు మారవని ఇతగాడు సందేశం ఇస్తున్నాడో, ఎవరు పుట్టుకతోటే అసమర్ధులని చెప్తున్నాడో ఆ తరగతుల ప్రజలే ఇతగాడి సినిమాలను ఆదరిస్తున్నారు. ఇదో విషాద విచిత్రం.

ఇక తానేం చూపించినా, ఏ డైలాగులు పలికించినా ఈ తెలుగు ప్రజలు ఆదరించక ఛస్తారా అన్న ధీమా ఈ పెద్ద మనిషిని ఆవరించినట్టుంది కాబోలు. ‘గుంటూరు కారం’ సినిమాలో ఏకంగా విలన్లకు మార్క్స్‌, లెనిన్‌ పేర్లను పెట్టాడు. అంతర్జాతీయ చారిత్రిక వ్యక్తుల పేర్లను పెట్టడం సినిమాల్లో ఇదే మొదటిసారి కాదు. గతంలో ‘హిట్లర్‌’ పేరుతో చిరంజీవి హీరోగా ఒక సినిమా వచ్చింది. హీరో అంటే పడని వ్యక్తులు అతడికి ఆ నిక్‌నేమ్‌ పెట్టినట్లు చూపించారు. అదే హీరోతో ‘స్టాలిన్‌’ అని మరో సినిమా తీశారు. ఈ స్టాలిన్‌ జనం తరఫున నిలబడ్డాడు గనుక వివాదం లేదు. కాని ‘గుంటూరు కారం’లో ప్రపంచ శ్రామిక జనావళి విముక్తికి బాటలు వేసిన మహనీయులు మార్క్స్‌, లెనిన్‌ పేర్లతో విలన్ల పాత్రలను సృష్టించడం చూస్తే కడుపులో వికారం కలుగుతోంది.

శ్రమ అన్నా, శ్రామికులు అన్నా ఏవగింపు లేదా చిన్న చూపు ప్రదర్శించడం, ఆకర్షణీయమైన రీతిలో కార్పొరేట్ల పట్ల భ్రమలు పెంచడం, ఉద్యమాలను అవహేళన చేయడం, కమ్యూనిస్టులను సమాజానికి శత్రువులుగా చిత్రించడం-ఇందులో ఇంతవరకూ పాశ్చాత్య సినిమాలు ముందున్నాయి. ఇప్పుడు తామూ తీసిపోమనే విధంగా తెలుగులో పోటీ పడడానికి కొందరు తయారయ్యారు. ‘గుంటూరు కారం’ దర్శకుడు కూడా అదే కోవకి చెందుతాడు. ఆర్థిక, సామాజిక, లైంగిక వివక్షతలు సమాజంలో ఎంత పెచ్చుమీరిపోతున్నా, వాటి చాయలు మచ్చుకైనా ఈయనగారి చిత్రాల్లో కనిపించవు. వాటిని చిత్రించడానికి దమ్ము కావాలి. ఆ దమ్ము లేనివారు ‘గుంటూరు కారం’ తీస్తే ఏమౌతుంది? ఫ్లాప్‌ మాత్రమే ఔతుంది.

గుంటూరు కారం చేవ వివక్షతను, అన్యాయాన్ని ఎదిరించి పోరాడే ప్రజా ఉద్యమాల్లో ఉంటుంది. ఎర్ర జెండా రెపరెపల్లో ఉంటుంది. ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది గుంటూరు జిల్లా. జాతీయోద్యమం లోనూ ఆ జిల్లాదే అగ్రస్థానం. ”అసలే విశాఖపట్నం వాళ్ళు ! ఉక్కు ముక్కల్తో కొడతారో ఏమిటో !” అని ‘శంకరాభరణం’ సినిమాలో పొట్టి ప్రసాద్‌ డైలాగ్‌ ఒకటుంది. అలాగ, ”అసలే గుంటూరు వాళ్ళు!…..” ఊరుకుంటారా ?

”మా కథలో మేం సృష్టించే పాత్రలకి మాకు తోచిన పేర్లను పెట్టుకునే స్వేచ్ఛ మాకు లేదా ?” అని అడగవచ్చు. ఆ విధంగా పేర్లు పెట్టడంలో ఔచిత్యం కనుమరుగైతే, నిలదీసే స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా !

”కమ్యూనిస్టులు ఇంకెక్కడున్నారండీ! వాళ్ళ పని అయి పోయింది” అని అనుకుంటూ తమకు తాము ధైర్యం చెప్పుకుంటున్న వాళ్ళకి సడెన్‌గా మార్క్స్‌, లెనిన్‌ ఎందుకు గుర్తుకొచ్చారో! అలలుగా ఎగిసిపడుతున్న ఎర్ర జెండాల రెపరెపలు భయపెడుతున్నాయా?

ఇతగాడే సంభాషణలు రాసిన సినిమా ‘మల్లీశ్వరి’. ఇందులో హీరోయిన్‌ మీద హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఆమె లాయర్‌ ”ఈ దాడి సంగతేమో గాని ఆస్తి కేసులో మాత్రం అవతలివాళ్ళు ఓడిపోతున్నారని ఖచ్చితంగా చెప్పగలను” అంటాడు. ఇప్పుడు అదే డైలాగ్‌ను తిప్పి మనమూ ”సినిమాలో పేర్ల సంగతేమోగాని, అవతలి వాళ్ళకి కష్టజీవుల పోరాటాలంటే వణుకు ప్రారంభం అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు” అందాం.

 

  • సుబ్రమణ్యం
➡️